బిగ్ బ్రేకింగ్.. అమరావతికి చట్టబద్ధత.. రాజ్యసభలో ఆమోదం, బీఆర్ఎస్ మద్దతు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ కోరుకుంటోందని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.;
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. బుధవారం లోక్ సభ మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించగా, రాజ్యసభలోనూ గురువారం సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టిన తీర్మానంపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అన్ని పార్టీలు చర్చలో పాల్గొన్నాయి. అయితే విపక్ష పార్టీ వైసీపీ మాత్రం బిల్లును యథాతథంగా ఆమోదించలేమని చెబుతూ వాకౌట్ చేసింది. ఇదే సమయంలో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజధాని అమరావతి బిల్లుకు తమ మద్దతు ప్రకటించింది.
రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు లభించింది. రాజధాని రైతుల విషయంలో బిల్లులో వివరణ ఇవ్వలేదని, రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పలేదని ఆక్షేపిస్తూ బిల్లును తాము వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీకి సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అమరావతి బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తమ పార్టీ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పలేదని తెలిపారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ కోరుకుంటోందని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఇక సభలో అన్ని పక్షాలు మాట్లాడిన తర్వాత బిల్లును రాజ్యసభ ఆమోదించినట్లు చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి అంగీకారంతో బిల్లు చట్టంగా మారుతుందని చెబుతున్నారు.
పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో రాష్ట్రవిభజన తర్వాత 12 ఏళ్లకు అమరావతికి చట్టబద్ధత కల్పించినట్లైంది. 2014లో రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తూ అప్పట్లో చట్టం చేశారు. ఇది పదేళ్ల వరకు అమలులో ఉంటుందని ఆ చట్టంలోనే స్పష్టం చేశారు. దీంతో 2015లోనే ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినా చట్టబద్ధ రాజధానిగా 2024 వరకు హైదరాబాద్ కొనసాగింది. ఇక గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరింది.
గత ఏడాది రాష్ట్ర కేబినెట్ లో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేబినెట్ తీర్మానంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ, బిల్లుకు మరింత బలం చేకూరేలా అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని కేంద్రం సూచించింది. దీంతో గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి తీర్మానం ప్రవేశపెట్టింది. సుమారు ఐదు గంటల చర్చ అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపగా, కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల వ్యవధిలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర రాజధాని విషయంలో దేశంలోని అన్నిపార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడంపై కూటమి నేతలు హర్షం ప్రకటించారు.