నాని ఔటేనా.. మేయర్‌ కేనా సీటు!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలదే కీలకపాత్ర. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే 34 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Update: 2024-01-22 02:45 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలదే కీలకపాత్ర. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులోనూ ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుందని అనే నానుడి ఉంది.

ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో అధికార పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఏలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014లో ఆయన వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి బడేటి బుజ్జిపైన ఆళ్ల నాని గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టారు.

Read more!

జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నాని పదవి పోయింది. అలాగే వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగా నిర్వహించనివారిలో ఆళ్ల నాని కూడా ఉన్నారని టాక్‌ నడిచింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనివారి పేర్లను చదివినప్పుడు అందులో ఆళ్ల నాని కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఏలూరు సీటును ఈసారి ఆళ్ల నానికి ఇవ్వరని చర్చ జరుగుతోంది. ఏలూరు నుంచి ఆళ్ల నానికి బదులుగా ప్రస్తుతం నగర మేయర్‌ గా ఉన్న నూర్జహాన్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబును రంగంలోకి దించుతారని చెబుతున్నారు. పెదబాబు బీసీ వర్గానికి చెందినవారు. ఆయనకు సీటు ఇవ్వకపోతే మేయర్‌ నూర్జహాన్‌ నే బరిలోకి దింపొచ్చని చెబుతున్నారు.

మరోవైపు ఏలూరులో కాపులు అత్యధికంగా ఉన్నారు. కమ్మలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులను పక్కనపెట్టి ఏ పార్టీ రాజకీయం చేయగల పరిస్థితి లేదని అంటున్నారు. అందులోనూ ఆళ్ల నాని.. వైఎస్సార్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అప్పట్లో వైఎస్సార్‌ తో, ఇప్పుడు జగన్‌ తో ఆ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నానిని పక్కనపెట్టే సాహసం జగన్‌ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల నాని పేరు వినిపించింది. అయితే అనూహ్యంగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్‌ కుమార్‌ కు ఏలూరు ఎంపీ అభ్యర్థిత్వం దక్కింది. ఈ మేరకు ఇటీవల ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నానికి సీటు ఇవ్వకపోతే ఆయనకు ఎక్కడ సర్దుబాటు చేస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News