మళ్లీ ట్రోలర్లకు చిక్కిన ఆళ్ల.. ఈ సారి స్కూటీని వాడేసిన మాజీ ఎమ్మెల్యే..
రాజకీయంగా విలక్షణంగా కనిపించాలని కోరుకునే నేతల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ముందుంటారు.;
రాజకీయంగా విలక్షణంగా కనిపించాలని కోరుకునే నేతల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ముందుంటారు. టీడీపీ యువనేత, రాష్ట్రమంత్రి నారా లోకేశ్ రాజకీయ ప్రత్యర్థిగా రాష్ట్రమంతా పాపులారిటీ సంపాదించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల అంతకుమించి చేసే విన్యాసాలతో సోషల్ మీడియా ట్రోలర్లకు మంచి కంటెంట్ ఇస్తుంటారు. ఎమ్మెల్యేగా ఉంటూ సొంతంగా వ్యవసాయ పనులు చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులివ్వడమే కాకుండా మంగళగిరి మహర్షిగా ప్రచారం చేసుకోవడం ఆళ్ల ప్రత్యేకం. ఇక టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఆళ్ల.. సీఐడీ కార్యాలయానికి తాను హాజరయ్యే సమయాన్ని ప్రచార అవకాశంగా మార్చుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లను సిఐడీ పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో శనివారం గుంటూరులో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అయితే ఆ సమయంలో ఆయన స్కూటీపై రావడంపై చూసిన వారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సొంత కార్లు ఉన్నా, స్కూటీపై డ్రైవర్ తో వచ్చారంటూ ఆళ్లపై ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు. ఇక అంతకు ముందు కూడా ఆయన సోషల్ మీడియా కార్యకర్తలకు మంచి కంటెంట్ గా ఉపయోగపడేవారని అంటున్నారు.
ఎమ్మెల్యేగా ఉంటూ పొలం పనులు చేయడం ఆళ్ల ప్రత్యేకతగా వైసీపీతోపాటు ఆయన అనుచరులు ప్రచారం చేస్తారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు రైలులో ప్రయాణిస్తారని, రూ.కోట్ల ఆస్తి ఉన్నా చేతిలో చిన్న సంచితో చాలా సింపుల్ గా కనిపిస్తారని ఆయన అనుచరులు చెబుతారు. దీనిపై సోషల్ మీడియా లోపెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. మంగళగిరి మహర్షి అంటూ ఆయన అనుచరులు.. కరకట్ట.. క...సన్ అంటూ ఆయన ప్రత్యర్థులు పోస్టులు పెడుతుంటారు. ఇక తాజాగా కూడా ఆయన స్కూటీపై రావడాన్ని భిన్నరకాలుగా వైరల్ చేస్తున్నారు.
మంగళగిరి కార్యాలయంపై దాడి కేసులో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఆ సమయంలో తాను మంగళగిరిలో లేనని వెల్లడించారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీలో తాను ఎక్కడా లేనన్నారు. ఈ కేసులో విచారణకు హాజరైన వారిలో ఏ ఒక్కరూ తన పేరు చెప్పి ఉండరన్నారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.