ఈ ఫైర్ బ్రాండ్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్.. ఈసారీ కళ్లు చెదిరే మెజార్టీ

పరిచయం చేయాల్సిన గ్రేటర్ నేతల్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరు. మజ్లిస్ ఫైర్ బ్రాండ్ సుపరిచితులు.

Update: 2023-12-04 06:30 GMT

పరిచయం చేయాల్సిన గ్రేటర్ నేతల్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరు. మజ్లిస్ ఫైర్ బ్రాండ్ సుపరిచితులు. ఓపక్క ఆరోగ్య సమస్యలతో కిందా మీదా పడినా.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదు.. తనకు ప్రత్యామ్నాయం మరొకరు లేరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యలు.. పాతబస్తీ అంశాల విషయంలో రాజీ పడకపోవటమే కాదు.. నిండు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ లాంటి వారిని సైతం కడిగిపారేయటంలో అస్సలు వెనుకాడని గుణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆయన మరోసారి విజయం సాధించారు. నిజానికి ఆయన గెలుపు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ఆయన ఓడిపోతే వార్త కానీ గెలిస్తే కాదు.కాకుంటే.. ఈసారి గెలుపులో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఆయన గురించి ప్రత్యేకంగా రాయాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందటం ద్వారా డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇదో అరుదైన ఘనతగా చెప్పాలి.

1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్ గా గెలుస్తూనే వస్తున్నారు తప్పించి.. ఎప్పుడూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది లేదు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఎలాంటి సెంటిమెంట్లు ఉన్నా.. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన గెలుపు మాత్రం ఖాయమన్నట్లుగా ఉంటుంది. 1999 తర్వాత వరుసగా జరిగిన 2004, 2009, 2014, 2018లో వరుస విజయాల్ని సాధించిన అక్బరుద్దీన్.. తాజాగా ఆరోసారి గెలవటం ద్వారా డబుల్ హ్యాట్రిక్ ను సాధించారని చెప్పాలి. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈసారి ఆయన సాధించిన మెజార్టీ సైతం.. తెలంగాణ రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ కావటం ఒక విశేషంగా చెప్పాలి.

Tags:    

Similar News