సవాళ్ల మబ్బుల్లో ఎయిరిండియా సవారీ!
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా మూడేళ్ల క్రితం కొనుగోలు చేసింది టాటా గ్రూపు.;
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా మూడేళ్ల క్రితం కొనుగోలు చేసింది టాటా గ్రూపు. అప్పుట్లో కూరుకుపోయిన ఈ విమానయాన సంస్థను తిరిగి గాడిన పడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. నిర్వహణ చికాకులతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియాకు తాజాగా అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న అతి పెద్ద విమాన ప్రమాదం సవాళ్లను మరింత పెంచే పరిస్థితి.
ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 197 విమానాలు ఉండగా.. ఇందులో 27 విమానాలు 10 - 15 ఏళ్ల నాటి విమానాలు. ఇక.. 43 విమానాలు 15 ఏళ్ల కంటే ఎక్కవ కాలం పాటు సర్వీసులో ఉన్న విమానాలు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ వద్ద ఉనన 101 విమానాల్లో 37 శాతం 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న విమానాలు కావటం గమనార్హం. నిపుణుల వాదన ప్రకారం చూస్తే అహ్మదాబాద్ దుర్ఘటనలో కూలిన డ్రీమ్ లైనర్ విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఇది పాతికేళ్ల నుంచి ముప్ఫై ఏళ్ల వరకు సేవలు అందిస్తుందని చెబుతున్నారు. 2014లో ఈ విమాన డెలివరీ అందుకున్న కమాండర్ చెప్పినట్లుగా చెబుతారు.
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు తన చేతుల్లోకి తీసుకుంది. అంతర్జాతీయ పోటీ సంస్థలతో పోటీ పడేలా ఎయిరిండియాను తీర్చి దిద్దాలని ప్లాన్ చేసి.. అందుకు తగ్గట్లుగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సంస్థకు పలు విధాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. సిబ్బంది వ్యవహరించే తీరు.. వారి పని పరిమితులు.. సాంకేతిక సమస్యలు.. తరచూ ఏదో ఒక పంచాయితీని తెచ్చి పెడుతోంది.
ఇది సరిపోదన్నట్లు కశ్మీర్ అంశంపై ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలు పాక్ గగనతలం మీదుగా ఎగరకూడదన్న ఆంక్షలు విధించటం తెలిసిందే. దీంతో.. అంతర్జాతీయ సర్వీసులకు చుట్టూ తిరిగి వెళ్లటం ద్వారా.. ఎయిరిండియాకు ఏడాదికి జరిగే ఆర్థిక నష్టం 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎయిరిండియా పాత విమానాల్లోని లోపలి భాగాల నవీకరణకు 400 మిలియన్ డాలర్లు గ్రూపు కేటాయించినా.. వాటికి అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యం అవుతోంది. దీంతో తాను అనుకున్న ప్లాన్ ను అనుకున్నట్లుగా అమలు చేయలేని పరిస్థితి.
సమయ పాలన విషయంలోనూ తరచూ ఫిర్యాదుల్ని ఎదుర్కొంటోంది. 2024లో సగటున 46 నిమిషాల ఆలస్యంతో బ్రిటన్ లో టైమింగ్ విషయంలో అధ్వాన విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. తాజా దుర్ఘటన నేపథ్యంలో జరిగే దర్యాప్తు.. అందులో బయటకు వచ్చే అంశాలే ఎయిరిండియా ఫ్యూచర్ కు కీలకంగా మారతాయని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.