అహ్మదాబాద్ ఏఐ విమాన ప్రమాదం ఘటనలో కీలక పరిణామం!

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-16 20:30 GMT

ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇటు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు జరుపుతోంది. ఈ సమయంలో ఓ కీలక పరిణామ చోటు చేసుకుంది.

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అత్యంత తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలు ఏఏఐబీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా... సేకరించిన ప్రాథమిక వివరాలను గతంలోనే వెల్లడించింది. ఇందులో ఫ్లైట్ ప్రమాదానికి ముందు పైలట్ల సంభాషణలను విడుదల చేసింది. దీనిపై పైలట్ల సంఘాలు మండిపడ్డాయి. ఆ తర్వాత పెద్దగా అప్ డేట్స్ రాలేదు!

ఈ సమయంలో... ఎయిరిండియా విమానం ఏఐ171 ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లేకపోవడం అనే విషయంపై కలత చెందిన దివంగత కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి.. ఈ ప్రమాదంపై న్యాయ పర్యవేక్షణలో విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఏఐ171 క్రాష్ పై దర్యాప్తు చేయడానికి కోర్టు మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో భాగంగా... ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గతంలో నిర్వహించిన అన్ని దర్యాప్తులను మూసివేసినట్లుగా పరిగణించాలని.. అన్ని ముఖ్యమైన ఆధారాలను రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని స్వతంత్ర విమానయాన, సాంకేతిక నిపుణులను సభ్యులుగా కలిగి ఉన్న న్యాయ పర్యవేక్షణ కమిటీ లేదా విచారణ కోర్టుకు బదిలీ చేయాలని కోరారు.

కాగా... లండన్ గాట్విక్‌ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఏఐ171 పైలట్‌ లలో ఒకరైన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి 91 ఏళ్ల పుష్కరాజ్ సభర్వాల్.. 2017 నాటి విమాన (ప్రమాదాలు, సంఘటనల దర్యాప్తు) నిబంధనలలోని 12వ నిబంధన ప్రకారం అధికారిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పౌర విమానయాన కార్యదర్శి, ఏఏఐబీ డైరెక్టర్ జనరల్‌ కు గతంలో లేఖ రాశారు.

ఈ సందర్భంగా... ప్రమాదం గురించి ఎంపిక చేసిన లీకులు, అసత్యాలు తన ఆరోగ్యం, మానసిక స్థితితో పాటు కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ప్రతిష్టను చాలా ప్రతికూలంగా ప్రభావితం చేశాయని.. అవి కెప్టెన్ సబర్వాల్ ప్రతిష్టను దెబ్బతీశాయని చెబుతూ... ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భారత పౌరుడికి హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు!

ప్రమాధం జరిగిన సుమారు నెల రోజుల తర్వాత జూలై 12 నాటి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక లోపభూయిష్టంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్‌ లోని విషయాలతో సహా ప్రాథమిక దర్యాప్తులోని ఎంపిక చేసిన సమాచారాన్ని బహిరంగంగా ఉంచారని ఆరోపించింది!

Tags:    

Similar News