అహ్మదాబాద్ ఘటన... దేశంలో అత్యధిక ఎయిర్‌ బీమా క్లెయిమ్‌ ఇదేనా?

జూన్ 12న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే సమయంలో టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-18 09:54 GMT

జూన్ 12న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే సమయంలో టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమీపంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన బీమా క్లెయిమ్ లపై ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈ విమానం కుడివైపునున్న ఇంజిన్ ను మూడు నెలల క్రితమే ఓవర్ హోలింగ్ సమయంలో అమర్చినట్లు గుర్తించారు. దీన్ని చివరిసారిగా జూన్ 2023లో మెయింటెనెన్స్ చేశారు. తిరిగి 2025 డిసెంబర్ లో మరోసారి నిర్వహించాల్సి ఉంది.

అయితే.. ఈ లోపే ఘోర ప్రమాదానికి గురై అంగిగోళంలా మారి బూడిదైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన ఈ ఏఐ171 విమానానికి ఇన్స్యూరెన్స్ కవర్ ను సంస్థ రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది. ఇంజిన్ రీప్లేస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో అందే బీమాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా.. నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిమ్ లు 475 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అంటే.. సుమారు రూ.4,091 కోట్లు అన్నమాట. దీంతో.. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా... జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ సీఎండీ రామస్వామి నారాయణన్‌ వివరాలు తెలిపారు!

ఇందులో భాగంగా.. వీటిల్లో ఎయిరిండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా చేర్చి విమానం ఖర్చు కంటే 2.5 రెట్లు అధికం కానున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా విమానం నష్టానికి 125 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రయాణికుల కుటుంబాలకు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలకు, ట్రావెల్‌ పాలసీలు, థర్డ్‌ పార్టీ మొత్తం కలిపి మరో 350 మిలియన్‌ డాలర్లు అవుతాయని తెలిపారు.

Tags:    

Similar News