1000 డిగ్రీల ఉష్ణోగ్రత..భయానక దృశ్యాలు గుర్తు చేసుకున్న అధికారులు!

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో 265 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-13 11:30 GMT

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో 265 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్దమైంది. ఆ సమయంలో... విమానం కూలిన తర్వాత 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నాటి భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు.

అవును... అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1,000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. అందువల్ల... సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) అధికారి ఒకరు... 1:39 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం రాగానే మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో మా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారని.. అంతకుముందే హాస్టల్‌ లో శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారని తెలిపారు.

అయితే... విమానంలోని ఇంధన ట్యాంక్‌ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని, ఫలితంగా క్షణాల్లోనే అక్కడి ఉష్ణోగ్రత 1,000 డిగ్రీల సెల్సియస్‌ కు పెరిగిందని.. దీంతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంటలు ఆ స్థాయిలో వ్యాప్తించడంతోనే పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ వేడి తీవ్రతను మరింతగా వివరించారు.

ఇందులో భాగంగా... గతంలో తాము ఎన్నో సహాయక చర్యలు చేపట్టాం కానీ, ఇలాంటి విపత్తును ఇంతకుముందెప్పుడూ చూడలేదని.. పీపీఈ కిట్లు వేసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని వివరించారు. పక్షులు సైతం పారిపోలేని స్థాయిలో ఒక్కసారిగా వేడి పెరిగిందని తెలిపారు.

ఆ ఉష్ణోగ్రత కారణంగా సమీపంలోని పక్షులు, శునకాలు కాలి బూడిదైపోయాయని.. ఇదే సమయంలో తీవ్రంగా కాలిపోయి, మాంసపు ముద్దలుగా మారిన ప్రయాణికులను గుర్తించడం సవాల్ మారిందని.. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించాయని, వాటి కింద కాలిన మృతదేహాలు ఉన్నాయని చెబుతూ ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు.

కాగా... ప్రమాదానికి గురైన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, ఆ సమయంలో మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే. అంత ఇంధనం ఒకేసారి మండటంతో టెంపరేచర్ 1,000 డిగ్రీలకు పెరిగిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News