పార్టీ కోసం ప్రాణత్యాగం.. ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త

దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని రాజకీయాలు.. రాజకీయ భావజాలం తమిళనాడులో కనిపిస్తుంది.

Update: 2026-06-02 10:30 GMT

దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని రాజకీయాలు.. రాజకీయ భావజాలం తమిళనాడులో కనిపిస్తుంది. పార్టీ విషయంలో నేతలు.. కార్యకర్తల వ్యవహారశైలి రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్త భిన్నమే. తాము ఫాలో అయ్యే పార్టీ విషయంలో తీవ్రమైన భావోద్వేగ బంధాన్ని కలిగి ఉండే తత్త్వం తమిళుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పార్టీ కోసం.. పార్టీ అధినేత మీద పిచ్చి ప్రేమను ప్రదర్శించటం ఎక్కువే. ఇందుకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న ఒక విషాద ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓడటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో వేదనకు గురైన 37 ఏళ్ల కేఎస్ పూక్కడై మహేంద్రన్ సెల్ఫీ వీడియో తీసి.. పార్టీ విషయంలో తనకున్న వేదనను వెల్లడించి.. పార్టీ నేతలు ఐక్యంగా ఉండాలన్న పిలుపును ఇవ్వటమే కాదు.. ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

పార్టీ కోసం కార్యర్త ఒకరు ప్రాణత్యాగం చేయటం.. ఈ క్రమంలో కుటుంబం కంటే పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిన వైనం కన్నీళ్లు తెప్పించేలా మారింది. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరుప్పనందాల్ ప్రాంతానికి చెందిన మహేంద్రన్ స్థానికంగా పూల వ్యాపారి. తంజావూరు తూర్పు జిల్లా పార్టీ వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు భార్య.. రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు ఆదివారం రాత్రి తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. ః

ఈ సందర్భంగా అమ్మ మరణం తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు.. చీలికలు.. అంతర్గత విభేధాలు మొదలు ఇటీవల ఎన్నికల్లో ఓటమి తనను మానసికంగా ఎంత తీవ్రంగా కుంగదీశాయన్న విషయాన్ని చెప్పిన ఆయన.. చీలిక వర్గాలన్నీ తమ విభేదాల్ని పక్కన పెట్టేసి ఏకం కావాలన్నది మహేంద్రన్ ప్రధాన డిమాండ్. అంతేకాదు.. తనకు మరో జన్మ ఉంటే.. ఆ జన్మలోనూ తాను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగానే పుట్టాలని. తాను ఆరాధించే నాయకుడు పళనిస్వామి వచ్చి తన భౌతికకాయానికి నివాళులు అర్పించాలని కోరారు. అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని వీడియోలో కన్నీటిపర్యంతమైన ఆయన మాటలు పెను సంచలనంగా మారాయి.

ఫేస్ బుక్ వీడియోలో చెప్పినట్లే.. కాసేపటికే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న మహేంద్రన్ ప్రాణత్యాగం చేశారు. ఈ ఉదంతం తమిళనాడు వ్యాప్తంగా షాకింగ్ గా మారటమే కాదు.. అన్నాడీఎంకేలో తీవ్ర విషాదానికి కారణమైంది. మహేంద్రన్ ఆఖరి కోరికకు తగ్గట్లే.. ఆయన మృతదేహానికి నివాళులు అర్పించేందుకు పళనిస్వామి వచ్చారు. అంతేకాదు.. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పటమే కాదు.. పరిహారాన్ని ప్రకటించారు. పార్టీ నిధి నుంచి రూ.55 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహేంద్రన్ కుమార్తె (రెండేళ్లు) పూర్తి బాధ్యత పార్టీ తీసుకుంటుందని.. ఆమె చదువుకు అయ్యే పూర్తి ఖర్చుల్ని పార్టీనే భరిస్తుందన్న భరోసాను పళనిస్వామి ప్రకటించారు.

అంతేకాదు.. పార్టీ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని.. పార్టీ కోసం కుటుంబాలను రోడ్డున పడేయొద్దని కోరారు. కార్యకర్తలే పార్టీకి బలమన్న పళనిస్వామి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉదంతంపై తిరుప్పనందాల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పార్టీ కోసం.. పార్టీ ఐక్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహేంద్రన్ ఉదంతాన్ని చూసినప్పుడు.. పార్టీ కోసం కార్యకర్తలు కాదు.. నేతలు మరెంత కమిట్ మెంట్ గా వ్యవహరించాలన్నది ఇప్పుడు చర్చగా మారింది.

Tags:    

Similar News