నెల‌కు 1-లక్ష: బాప్ రే! ఇంట్లో కూచుని AI ఇన్‌ఫ్లూయెన్స‌ర్ సంపాద‌న‌!!

సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని..సరికొత్త సాంకేతికతతో నెలకు లక్షల్లో సంపాదించడం ఇప్పుడు కల కాదు.. నిఖార్సయిన వాస్తవం.

Update: 2026-05-25 03:45 GMT

సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని..సరికొత్త సాంకేతికతతో నెలకు లక్షల్లో సంపాదించడం ఇప్పుడు కల కాదు.. నిఖార్సయిన వాస్తవం. ఇన్‌స్టాలో రోజువారీ పోస్టులతో సందడి చేస్తూ.. లక్షలాది మంది ఫాలోవర్లను ఆకట్టుకుంటూ.. నెలకు రూ.1 లక్షకు పైగా ఆర్జిస్తున్న ఒక ప్రముఖ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ప్రొఫైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్న ఈ ఇన్‌స్టా మహిళ నిజ జీవితంలో అస్సలు ఉనికిలోనే లేదు. కేవలం కంప్యూటర్ కోడింగ్.. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో సృష్టించబడిన ఒక వర్చువల్ పాత్ర ఇది.

సాధారణ లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల తరహాలోనే ఈ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాంప్రదాయ దుస్తులలో మురిపించే ఫోటోలు... ఆహ్లాదకరమైన బీచ్ స్నాప్‌షాట్‌లు.. టీ-టైమ్ మూవ్ మెంట్స్.. రంగురంగుల ఫోటోగ్రాఫ్స్ తో ఈ ఫీడ్ నిండిపోయింది. సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసం ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఈ ఫ్రేమ్‌లను చూసి... మొదటి చూపులో ఎవ్వరైనా సరే త‌న‌ను నిజమైన వ్యక్తిగానే భ్రమిస్తారు. కానీ ఈ అందమైన దృశ్యాల వెనుక ఉన్నది ఒక కృత్రిమ మేధో సృష్టి అనే రహస్యం చాలా మంది ఫాలోవర్లకు వెంటనే అర్థం కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా వర్చువల్ క్రియేటర్లు... ఆన్‌లైన్ ఆదాయం... డిజిటల్ కంటెంట్ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవికతకు, కృత్రిమత్వానికి మధ్య గల సన్నని గీతను చెరిపేస్తూ దూసుకుపోతున్న ఈ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ఆ చర్చను మరింత తీవ్రం చేసింది. సబ్‌స్క్రిప్షన్‌లు, బ్రాండ్ కోఆర్డినేష‌న్ ల‌తో ఈ డిజిటల్ అవతారాలు గరిష్టంగా డబ్బు సంపాదిస్తున్న తీరును ఆన్‌లైన్ వినియోగదారులు సాక్ష్యాలు సహా ప్ర‌తిదీ చూపిస్తుండ‌డంతో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది.

ఈ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ వ్యాపారంలోని ఆర్థిక అంశాలు సామాన్యులతో పాటు సోషల్ మీడియా నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రత్యేకమైన కంటెంట్‌ను వీక్షించేందుకు సబ్‌స్క్రైబర్‌లు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తున్నారు. కేవలం వందల సంఖ్యలో ఉన్న సబ్‌స్క్రైబర్‌ల ద్వారానే ఈ ఖాతా కేవలం సబ్‌స్క్రిప్షన్‌ల రూపంలోనే నెలకు దాదాపు రూ.1 లక్షకు పైగా ఆర్జిస్తోంది. ఈ ఆదాయంలో బ్రాండ్ ప్రమోషన్‌లు, కమర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చే అదనపు సంపాదన ఇంకా చేర్చలేదు. అంటే.. ఈ ఏఐ వ్యక్తిత్వాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న అసలు క్రియేటర్లు ఇంకా భారీ స్థాయిలోనే లాభాలను గడిస్తున్నారని స్పష్టమవుతోంది.

రూపం, రంగు, ప్రవర్తనపై పూర్తి నియంత్రణను అందించే ఈ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు భవిష్యత్తులో బ్రాండింగ్ రంగాన్ని శాసించబోతున్నారు. ప్రేక్షకులను దృశ్యపరంగా కట్టిపడేసే పరిపూర్ణమైన కంటెంట్‌ను నిరంతరం అందించగలగడమే వీరి ప్రధాన ఆకర్షణ. అయితే మునుముందు రోజుల్లో ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారేకొద్దీ... ఆన్‌లైన్ వేదికలపై నిజమైన మనుషులకు... కృత్రిమంగా సృష్టించబడిన డిజిటల్ పాత్రలకు మధ్య తేడాలను గుర్తించడం సాధారణ వినియోగదారులకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఇటీవ‌లి కాలంలో వృతికా పటేల్ ఏఐ పేరుతో రూపొందించిన ఇన్ ఫ్ల్యూయెన్స‌ర్ సంపాద‌న ఇప్పుడు పెద్ద చర్చ‌గా మారింది. ఇదే త‌ర‌హాలో కొన్ని వంద‌ల వేల ఇన్ ఫ్లూయెన్స‌ర్లు మునుముందు ల‌క్ష‌ల్లో ఆర్జిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News