ఏఐ సహాయంతో 3 నెలల్లో 27 కిలోలు తగ్గిన హస్సాన్ కథ

జిమ్ మెషిన్ల అవసరం లేకుండా కేవలం తన శరీర బరువుతోనే చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టాడు.రోజుకు కేవలం 30 నుండి 45 నిమిషాలు కేటాయించాడు.;

Update: 2026-01-07 00:30 GMT

బరువు తగ్గాలంటే వేలకు వేలు జిమ్ ఫీజులు కట్టాలి.. పర్సనల్ ట్రైనర్‌ను పెట్టుకోవాలి.. ఖరీదైన డైట్ ఫుడ్ తినాలి.. ఇవే కదా మనందరి ఆలోచనలు? కానీ ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించాడు హస్సాన్. ఎటువంటి జిమ్ ఎక్విప్‌మెంట్ లేకుండా, కేవలం కృత్రిమ మేధస్సు సాయంతో 3 నెలల్లో 27 కిలోల బరువు తగ్గి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

ఏఐ: ఒకే ఒక్క యాప్.. మూడు రకాల పాత్రలు!

చాలామంది టెక్నాలజీని వినోదం కోసం వాడితే హస్సాన్ మాత్రం దాన్ని తన ఆరోగ్యానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను కేవలం సమాచారం కోసమే కాకుండా తన వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ ట్రైనర్, మెంటల్ కోచ్‌గా మార్చుకున్నాడు. "నా దగ్గర జిమ్ సభ్యత్వం తీసుకోవడానికి డబ్బు లేదు. కానీ మార్పు సాధించాలనే పట్టుదల ఉంది. ఆ పట్టుదలకు ఏఐ తోడైంది" అని హస్సాన్ గర్వంగా చెబుతున్నాడు.

ఏమిటీ 'హస్సాన్' సక్సెస్ ఫార్ములా?

హస్సాన్ తన ప్రయాణాన్ని మూడు ప్రధాన విభాగాలుగా విభజించుకున్నాడు. బరువు తగ్గడం అంటే ఆకలితో అలమటించడం కాదు. ఏఐ సాయంతో హస్సాన్ తన ఇంట్లో లభించే సాధారణ ఆహార పదార్థాలతోనే 'క్యాలరీ డెఫిసిట్' డైట్‌ను రూపొందించుకున్నాడు. ఉదయం పూట శక్తినిచ్చే పీచు పదార్థాలు, ప్రోటీన్..పరిమిత పరిమాణంలో ఇంట్లో వండిన భోజనం తీసుకున్నాడు. పంచదార, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తి స్వస్తి చెప్పాడు.

బాడీ వెయిట్ వర్కౌట్స్

జిమ్ మెషిన్ల అవసరం లేకుండా కేవలం తన శరీర బరువుతోనే చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టాడు.రోజుకు కేవలం 30 నుండి 45 నిమిషాలు కేటాయించాడు. పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వాకింగ్ ద్వారా కేలరీలను కరిగించాడు. ప్రతి వ్యాయామం ఎలా చేయాలో ఏఐ ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించాడు

మైండ్‌సెట్ కోచింగ్

అందరూ డైట్ మొదలుపెడతారు కానీ మధ్యలో వదిలేస్తారు. ఇక్కడే హస్సాన్ భిన్నంగా ఆలోచించాడు. తనకు నిరుత్సాహం కలిగినప్పుడు అలసటగా అనిపించినప్పుడు ఏఐ ద్వారా మోటివేషన్ పొందేవాడు. ఈరోజు ఒక్క పూట తింటే ఏమవుతుందిలే? అనే ఆలోచన రాకుండా ఏఐ అతడిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ట్రాక్ చేస్తూ ఉండేది.

ఖర్చు సున్నా.. ఫలితం అద్భుతం!

హస్సాన్ కథ చెబుతున్న అసలు నిజం ఏంటంటే.. మార్పు రావాల్సింది మన ఆలోచనల్లోనే. ఖరీదైన సప్లిమెంట్లు, ఏసీ జిమ్ములు లేకపోయినా సరైన డిసిప్లిన్ ఉంటే ఏదైనా సాధ్యమే. టెక్నాలజీని విజ్ఞానదాయకంగా వాడుకుంటే అది మన జీవితాన్నే మార్చేస్తుందని హస్సాన్ నిరూపించాడు.

నేడు ఊబకాయంతో బాధపడుతున్న వేలాది మందికి హస్సాన్ ఒక ఆశాకిరణం. మీరు కూడా బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ చేతిలో ఉన్న ఫోన్‌నే మీ కోచ్‌గా మార్చుకోండి.. నేడే మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించండి.

Disclaimer : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సూచనలు కేవలం అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఉంటాయి. ఇవి వృత్తిపరమైన వైద్య సలహాలకు ప్రత్యామ్నాయం కావు. Tupaki.com దీన్ని ధృవీకరించడం లేదు. దీన్ని ఫాలో అవ్వాలని సూచించడం లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే..

Tags:    

Similar News