భూపేష్ రెడ్డికి లైన్ క్లియ‌ర్‌.. అస‌లు టెస్టు ఇప్పుడే.. !

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి సీటు ఇవ్వడం ఖాయమని ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కూడా చెప్పానని ఆయన వెల్లడించడం విశేషం.;

Update: 2025-10-08 04:26 GMT

బిజెపి సీనియర్ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేది లేదని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి సీటు ఇవ్వడం ఖాయమని ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కూడా చెప్పానని ఆయన వెల్లడించడం విశేషం. నిజానికి గత ఎన్నికల్లోనే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేయాలని భావించారు.

కానీ, చివరి నిమిషంలో ఈ సీటును బిజెపికి కేటాయించడంతో ఆయన తీవ్ర ఆవేదనతోనే పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఒకటికి రెండుసార్లు భూపేష్ రెడ్డిని ఓదార్చడం, వచ్చే ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భూపేష్ రెడ్డి వర్గంలో సంతోషాన్ని నింపాయి. వచ్చే ఎన్నికల నాటికి తను పోటీ నుంచి తప్పుకుంటానని క్రియాశీల రాజకీయాల్లో కూడా ఉండే ఉద్దేశం తనకు లేదని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు.

అంతేకాదు, భూపేష్ రెడ్డి విజ‌యం కోసం కూడా తాను కృషి చేస్తానని ఆదినారాయణ రెడ్డి చెప్ప‌డం గమనార్హం. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది మరో వాదనగా ఉంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన వైసీపీ క్యాడర్ ఉంది. అదే సమయంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా ఉన్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల వాదన మరోరకంగా ఉంది. తమ నాయకుడికి ఇస్తున్న మద్దతు భూపేష్ రెడ్డికి ఇచ్చే విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది అన్నది స్పష్టంగా వినిపిస్తున్న మాట.

వాస్తవానికి సీనియర్ నాయకుడైన ఆదినారాయణ రెడ్డి అన్ని వర్గాలను కలుపుకుని పోయే విషయంలో ఆది నుంచి కీలకపాత్ర పోషించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. అన్ని వర్గాలతో సమన్వయం చేసుకోవడం ఎన్నికల సమయానికి అందర్నీ కలుపుకుని ముందుకు సాగడం వంటివి కలిసి వచ్చాయి. ఈ తరహా పరిస్థితి భూమేష్ రెడ్డికి ఆది నుంచి లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. టిడిపిలోనే ఒక వర్గం నాయకులు ఆయనను వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో భూపేష్ రెడ్డికి అంత బలమైన మద్దతు లేదు.

రెడ్డి సామాజిక వర్గాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారని, వారికి మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నారని గత ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఆ సామాజిక వర్గంలోని కొంతమంది నాయకులు సీఎం చంద్రబాబుకు ఈ విషయం చెప్పడంతోనే ఈ సీట్ను బిజెపికి కేటాయించారన్న వాద‌న కూడా అప్ప‌ట్లో వినిపించింది. ఈ విషయంపై భూపేష్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. తాను అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నానని కానీ కొందరు పనిగట్టుకుని తనపై విమర్శలకు గుప్పిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి భూపేష్ రెడ్డి ఏ తరహా రాజకీయాలు నమ్ముకుంటారు... ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది ఆసక్తి కరం. అయితే ఆదినారాయణ రెడ్డి తప్పుకోవడం, తన మద్దతు కూడా భూపేష్ రెడ్డికి ఉంటుందని చెప్పడంతో కొంత వరకు మెరుగైన అవకాశాలు ఉంటాయని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా భూపేష్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం లైన్ క్లియర్ అయితే అయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పుంజుకోవాలంటే ఇప్పటి నుంచే తన పంథాను మార్చుకొని అన్ని వర్గాలను కలుపుకొని పోయే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News