వాషింగ్టన్ పోస్ట్ కలకలం.. ఖండించిన ఎల్ఐసీ, అదానీ గ్రూప్.. అసలేం జరిగింది?

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్ మరోసారి విదేశీ మీడియా ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.;

Update: 2025-10-26 04:16 GMT

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్ మరోసారి విదేశీ మీడియా ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల అమెరికా ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఆ కథనంలో పేర్కొన్న విషయాలు పూర్తిగా నిరాధారమని ఎల్ఐసి (LIC) , అదానీ గ్రూప్ స్పష్టం చేశాయి.

* వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం - నీతి ఆయోగ్ కలిసి ఎల్ఐసిని ఒత్తిడి చేసి రూ. 33 వేల కోట్ల (3.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టేలా చేశారని పేర్కొంది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అదానీకి చెందిన ప్రైవేట్ జెట్ ఉపయోగించారని కూడా ఆ కథనంలో ఆరోపించారు. అంతేకాక, అదానీ కంపెనీల్లో పెట్టుబడులు "రాజకీయ ఒత్తిడి" ఫలితంగా జరిగాయని పేర్కొంది.

* హిండెన్ బర్గ్ తరహా ఆరోపణలు

2023లో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచారని ఆ సంస్థ ఆరోపించింది. అయితే భారతీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆ ఆరోపణలను విచారించి అవి నిరాధారమని తేల్చింది. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ అదే కథను మళ్లీ కొత్త రూపంలో ప్రచురించిందని అదానీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

* ఎల్ఐసి ఘాటైన స్పందన

వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఎల్ఐసి తీవ్రంగా ఖండించింది. “మా పెట్టుబడి నిర్ణయాలు స్వతంత్రంగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదంతోనే జరుగుతాయి. ఎలాంటి బయటి ప్రభావం, ప్రభుత్వ ఒత్తిడి ఉండదు” అని సంస్థ స్పష్టం చేసింది.

* ఎల్ఐసి వివరాల ప్రకారం

ఎల్ఐసీ దేశవ్యాప్తంగా 351 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.మొత్తం ఆస్తుల విలువ ₹41 లక్షల కోట్లు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు మొత్తం పోర్ట్‌ఫోలియోలో కేవలం 2% మాత్రమే. పెట్టుబడులు అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరుగుతాయి. “వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం వాస్తవాలకు దూరంగా ఉంది. ఇవి ఆధారరహితమైన ఆరోపణలు మాత్రమే. మా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారు” అని ఎల్ఐసి స్పష్టం చేసింది.

* అదానీ గ్రూప్ ప్రతిస్పందన

అదానీ గ్రూప్ కూడా ఈ కథనాన్ని ఖండించింది. “ఏ ప్రభుత్వ ప్లాన్ లేదా ప్రతిపాదనలో మా ప్రమేయం లేదు. ఎల్ఐసి పెట్టుబడి నిర్ణయాలు వారి అంతర్గత విధానాల ప్రకారమే జరిగాయి. మా కంపెనీ ఆర్థిక స్థితి బలంగా ఉంది” అని పేర్కొంది.

* రాజకీయ వర్గాల్లో ప్రతిస్పందనలు

వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువడిన వెంటనే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. అయితే ఎల్ఐసి ఇచ్చిన స్పష్టతతో ఈ ఆరోపణలు అబద్దాలని పాలక వర్గాలు అంటున్నాయి.

వాషింగ్టన్ పోస్ట్ కథనం మరోసారి భారతీయ సంస్థలపై విదేశీ మీడియా దాడిగా భావించబడుతోంది. ఇప్పటికే హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికీ చర్చలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు కొత్త వివాదానికి దారి తీశాయి. అయితే ఎల్ఐసి, అదానీ గ్రూప్ రెండు సంస్థలూ స్పష్టంగా ఈ ఆరోపణలను తిరస్కరించడంతో, ఈ కథనం నిజానిజాలు మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.

Tags:    

Similar News