మీడియాను నిషేధించాలి.. న్యాయవాదుల డిమాండుకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన జడ్జి

ఏపీలోని విజయవాడ ఏసీబీ కోర్టులో ఓ ఆసక్తికర సంభాషణ వైరల్ అవుతోంది.;

Update: 2025-08-02 18:30 GMT

ఏపీలోని విజయవాడ ఏసీబీ కోర్టులో ఓ ఆసక్తికర సంభాషణ వైరల్ అవుతోంది. మద్యం కుంభకోణంపై నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తికి నిందితుల తరఫు న్యాయవాదులకు జరిగిన ఆ సంభాషణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణంపై నమోదైన కేసుల్లో విచారణ సందర్భంగా మీడియాను నిషేధించాలని న్యాయవాదులు కోరగా, అలా ఎలా ఆదేశించగలమో చెప్పాలంటూ న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించేసరికి కోర్టు హాలులో కాసేపు నిశ్శబ్దం ఆవహించిందని అక్కడి వారు చెబుతున్నారు. చట్ట నిబంధనల ప్రకారం ఆ అవకాశం లేకపోవడంతో న్యాయవాదులు మౌనాన్ని ఆశ్రయించగా, కోర్టు కూడా ఏం చేయలేమంటూ తేల్చిచెప్పడంతో ఈ వాదప్రతివాదనలు చర్చకు దారితీస్తున్నాయి.

ఏపీ మద్యం కుంభకోణంలో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది. ప్రధానంగా ఈ కేసు రాజకీయంగా కీలకంగా భావిస్తుండటం, నిందితుల్లో ఎక్కువ మంది ప్రతిపక్షానికి చెందిన వారు కావడంతో కేసు విచారణలో ప్రతి అంశం చర్చకు తావిస్తోంది. అయితే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే కక్షతో కేసులో అనవసర విషయాలకు ఎక్కువ ప్రచారం ఇస్తున్నారని, కోర్టు విచారణపై లీకులు ఇస్తూ తమ పరపతిని దెబ్బతీస్తున్నారని నిందితులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టిలో పెట్టి న్యాయం చేయమని వేడుకున్నారు. అయితే నిందితుల ఆవేదన విన్న న్యాయస్థానం వారి సమస్యను పరిష్కరించే మార్గాలను సైతం సూచించమని వారి తరపు న్యాయవాదులను కోరడంతో విచారణ మలుపు తిరిగిందని చెబుతున్నారు.

మద్యం కుంభకోణంలో పాత్రధారులు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల తరుపు న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టులో జరుగుతున్న విచారణను మీడియా తప్పుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిందితుల పరువు, ప్రతిష్టలకు నష్టం వాటిల్లేలా ప్రచారం చేస్తున్నందున ఏసీబీ కోర్టులో జరిగే విచారణకు మీడియా రాకుండా నిషేధించాలని అభ్యర్థించారు.

దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కోర్టు విచారణకు మీడియాను రాకుండా ఎలా అడ్డుకోగలమో తెలియజేయాలంటూ న్యాయవాదులను కోరడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఏ నిబంధన ప్రకారం మీడియాను పరిమితం చేయాలన్న ప్రతిపాదన చేస్తున్నారో చెప్పాలంటూ న్యాయమూర్తి ప్రశ్నించడంతో న్యాయవాదులు ఏం చెప్పలేకపోయారని అంటున్నారు. దీంతో ఈ సంభాషణపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News