తొక్కిసలాట జరిగిన కరూర్ పట్టణం ఎక్కడ?
కరూర్ నగరం మొత్తం 30.96 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించినట్లు చెబుతారు. కరూర్ జిల్లా మొత్తం జనాభాలో 8-10 శాతం మంది ప్రజలు కరూర్ సిటీలో నివాసం ఉంటారు.;
ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావటం.. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ కీలక భూమిక పోషిస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆయన తన రాజకీయ సభల్ని వేగంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరూర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. దీనికి పదివేల మంది అభిమానులు హాజరవుతారని భావిస్తే.. లక్షకు పైనే చేరుకోవటం.. తీవ్రమైన తొక్కిసలాటలో 38 మంది మరణిస్తే.. మరింత మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే.
ఇంతటి దారుణ విషాదానికి కారణమైన కరూర్ సిటీ ఎక్కడ ఉంటుంది? తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరానికి ఎంత దూరంలో కరూర్ సిటీ ఉంది? దీనికి దగ్గర్లో ఉన్న ఎయిర్ పోర్టు ఎక్కడ? కరూర్ సిటీ జనాభా ఎంత? ఈ పట్టణం దేనికి ఫేమస్ లాంటి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్ర మధ్య భాగంలో కరూర్ పట్టణం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణ జనాభా 2.34 లక్షలుగా చెబుతారు. అయితే.. ప్రస్తుత జనాభా దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల వరకు ఉంటారని చెబుతారు. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో టాప్ 20లో ఒకటిగా కరూర్ ను చెబుతారు.
కరూర్ నగరం మొత్తం 30.96 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించినట్లు చెబుతారు. కరూర్ జిల్లా మొత్తం జనాభాలో 8-10 శాతం మంది ప్రజలు కరూర్ సిటీలో నివాసం ఉంటారు. కరూర్ సిటీ చేనేత వస్త్రాలకు.. పారిశ్రామికంగానూ వ్యాపార కేంద్రంగానే ఫేమస్. జిల్లా కేంద్రమైన కరూర్ చెన్నైకు రోడ్డు మార్గంలో 350-370 కి.మీ దూరంలో ఉంటుంది.రోడ్డు ప్రయాణంలో చెన్నై నుంచి కరూర్ చేరుకోవటానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని చెప్పొచ్చు.
ఇక్కడ నుంచి చెన్నై.. బెంగళూరు.. తిరువనంతపురం.. తిరుపతి.. నాగర్ కోయిల్ లాంటి ముఖ్యపట్టణాలకు చేరుకునే మార్గంలో ఈ సిటీ ఉంటుంది. సేలం డివిజన్ లో ఉండే ఈ రైల్వే స్టేషన్.. దక్షిణ రైల్వేల్లోని ప్రణధాన రైల్వే స్టేషన్ లలో ఒకటిగా చెప్పొలి. రైల్వేల్లోని సేలం డివిజన్ లో ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ గా దీనికి పేరుంది. దాదాపు అన్ని రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి. వాయు మార్గంలో కరూర్ నగరానికి చేరుకోవటానికి నేరుగా అవకాశం లేదు. ఈ నగరానికి 78 కి.మీ. దూరంలో తిరుచిరాపల్లి ఎయిర్ పోర్టు ఉంది. ఇదే ఈ నగరానికి దగ్గరగా ఉండే ఎయిర్ పోర్టు.ఈ నగరానికి 121 కి.మీ. దూరంలో కోయంబత్తూరు ఎయిర పోర్టు.. 116 కి.మీ. దూరంలో సేలం ఎయిర్ పోర్టు ఉంది.
చరిత్రలోకి వెళ్లి చూస్తే.. ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే.. పురాతన కాలంలో రత్నాల తయారీకి కేంద్రంగా చెబుతారు. తెలుగు వారికి సుపరిచితమైన కరూర్ వైశ్యా బ్యాంక్ స్టార్ట్ చేసింది కూడా కరూర్ నగరంలోనే. ఈ బ్యాంక్ ఏర్పాటుతో కరూర్ సిటీ పేరు మరింత పాపులర్ అయ్యిందన్న మాటను చెబుతారు. సినీ నటుడు విజయ్ నిర్వహించిన రోడ్ షోలో దారుణ తొక్కిసలాట చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవటంతో ఇప్పుడు అందరి నోట కరూర్ నగరం నానటమే కాదు.. అసలు ఇదెక్కడ ఉందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.