వైవాహిక జీవితంలో అత్యధిక కాలం కలిసి ఉన్న జంట ఇదే.. వరల్డ్ రికార్డు వీరి సొంతం..
ఇప్పుడున్న ట్రెండ్ లో కనీసం పెళ్లి ఫొటోలు, వీడియోలు చేతికి అందకముందే విడాకులు కూడా పూర్తవుతున్నాయి.;
ఇప్పుడున్న ట్రెండ్ లో కనీసం పెళ్లి ఫొటోలు, వీడియోలు చేతికి అందకముందే విడాకులు కూడా పూర్తవుతున్నాయి. ఏదో నామ్ కే వాస్తేగా వివాహం చేసుకోవడం.. విడిపోవడం ఇదే నేడు ట్రెండ్. ఇరుగు, పొరుగు, బంధువుల మాటలు బరించలేకనే పెళ్లి అంటున్న జంటలు పెరిగిపోయాయి. పైగా కోర్టులు కూడా ఇద్దిరికి సమ్మతమైతే.. అన్న కోణంలోనే చూస్తుంది. నేటి కాలంలో పెళ్లి అనేది మజాక్.. కలిసి ఉండడం ఒక కల. కానీ 80's, 90'sలో మాత్రం అలా లేదు.. 90's ను కొంచెం పక్కన పెడితే 80's లో మాత్రం అలా జరగనేలేదని చెప్పాలి. భర్త ఎలాంటి వాడైనా భార్య సరిదిద్దుకుంటూ సంసారం చేసుకునేది. భర్త రెండో వివాహం చేసుకున్నా సర్ధుకొని ఉండేవారు. కానీ నేడు కాలం పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు పెళ్లికి ముందు లివింగ్, పెళ్లి తర్వాత వెడ్డింగ్ పార్ట్నర్ తోనే కాకుండా ఇతరులతో కూడా ఉండడం కామన్ గా మారింది.
రికార్డు నెలకొల్పిన దంపతులు..
ప్రేమ అంటే క్షణికమైన భావమని అనుకునే ఈ కాలంలో అమెరికాకు చెందిన వృద్ధ దంపతులు ఎలీనర్ గిట్టెన్స్ (107), లైల్ గిట్టెన్స్ (108) తమ జీవితం ద్వారా ప్రేమ అంటే సమర్పణ, సహనం, పరస్పర గౌరవం అని నిరూపించారు. ఈ దంపతులు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలం వివాహ బంధంలో ఉన్న జంటగా గుర్తింపబడ్డారు. 1942లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచం భయంతో వణుకుతున్న ఆ సమయంలో ఈ జంట కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు, 83 ఏళ్లు గడిచినా వారి బంధం యథాతథంగా నిలిచింది. ఒకరికొకరు చూపించే ప్రేమ నేటి యువతకు ఆదర్శంగా మారింది. ప్రపంచ రికార్డులను నమోదు చేసే సంస్థలు వీరిని ‘ఓల్డెస్ట్ లివింగ్ మ్యారీడ్ కపుల్’గా గుర్తించాయి. వీరి ప్రేమకథ, సహజీవనం ఇప్పుడు అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మొదట్లో కష్టంగా గడిచిన జీవితం..
ఎలీనర్ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు కాగా, లైల్ ఇంజినీయర్. వివాహ జీవితం మొదటి సంవత్సరాల్లో తగిన అవకాశాలు లేక, అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అయినా జీవితాన్ని కలిసే గడిపారు. ఎలీనర్ తన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ‘మేమిద్దరం ఎప్పుడూ ఒకరినొకరం మార్చాలని ప్రయత్నించలేదు. బదులుగా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాము.’ అన్నారు. ఈ జంట 83 ఏళ్ల దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు లేకపోలేదు. కానీ అవి ఎప్పుడూ పెద్దవిగా మారలేదు. లైల్ సంతోషంగా నవ్వుతూ చెప్పిన మాట ‘నాకు చివరి మాట ఎప్పుడూ ఉండేది అవును, ప్రియమైనా అని.’ ఈ ఒక వాక్యం వారి బంధానికి పునాది అయిన పరస్పర గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
గతంలో రికార్డు మనోయల్-మరియాపై..
ప్రపంచంలో ఇంతకాలం వివాహ బంధాన్ని కొనసాగించిన జంటగా వీరికి ముందు బ్రెజిల్‌కు చెందిన మనోయల్, మరియా లారెన్ జంట ఉన్నారు. వారు 85 సంవత్సరాలు కలిసి జీవించారు. కానీ వారిద్దరూ మరణించడంతో ఇప్పుడు ఆ రికార్డును ఎలీనర్, లైల్ గిట్టెన్స్ దంపతులు అధిగమించారు. వీరి దీర్ఘాయువుతో పాటు వారిలో కనిపించే అన్యోన్యత నేటి యువతకు విలువైన సందేశం ఇస్తోంది. ప్రేమ అంటే తాత్కాలిక మమకారం కాదు.. అది ఒక జీవితకాల బాధ్యత. స్మార్ట్‌ఫోన్ యుగంలో ఒక మెసేజ్ రాకపోతే బంధాలు విరిగిపోతున్న ఈ కాలంలో.. ఈ దంపతులు మనకు చెప్తున్నది ఏంటి? నిజమైన ప్రేమ అంటే రోజూ ఒకరిని గౌరవించుకోవడం, జీవితాన్ని కలసి నడిపించడం.
83 ఏళ్ల ప్రేమకథతో ఈ జంట మనకు నేర్పిందేమిటంటే, ప్రేమకు వయస్సు లేదు, సహనానికి గడువు లేదు, పరస్పర గౌరవం ఉన్న చోటే బంధాలు నిలుస్తాయి. ఎలీనర్-లైల్ గిట్టెన్స్ ఇప్పుడు రికార్డు బుక్‌లో ఉన్నారు, కానీ వారి జీవితం మాత్రం ప్రతి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది.