అమెరికా నుంచి పాశమైలారం దుర్ఘటన దాక.. 2025 ఫస్టాఫ్ తీవ్ర రక్తసిక్తం
ఈ సంవత్సరం ప్రారంభం అవుతూనే జనవరి 7న టిబెట్-నేపాల్-చైనాలో భారీ భూకంపం కుదిపేసింది. 126 మంది చనిపోయారు.;
2025... మొత్తం అంకెలు కూడితే 9 వస్తుంది.. సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 చాలా పవర్ ఫుల్ నంబరు. చాలామందికి లక్కీ నంబరు కూడా. వాహనాలకు ఈ నంబరు కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టేవారు ఎందరో..? అలాంటి 2025 సంవత్సరం వరుస విషాదాలతో హోరెత్తుతోంది. తిరుపతి తొక్కిసలాట నుంచి మొదలుపెట్టి జూన్ 30న జరిగిన పాశమైలారం దుర్ఘటన వరకు ఎన్నో ప్రమాదాలు. ఫస్టాఫ్ ఇంత దారుణంగా ఉన్న 2025లో సెకండాఫ్ ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం.
-ఈ సంవత్సరం ప్రారంభం అవుతూనే జనవరి 7న టిబెట్-నేపాల్-చైనాలో భారీ భూకంపం కుదిపేసింది. 126 మంది చనిపోయారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ పాలిసెడ్స్ లో కార్చిచ్చు చెలరేగి బీభత్సం రేపింది. 29 మంది చనిపోయారు. దీన్నుంచి తేరుకునేలోపే జనవరి 29న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవహించే పొటోమాక్ నదిపై సైనిక హెలికాప్టర్ బ్లాక్ హాక్- బాంబార్డియర్ జెట్ ఢీకొని 64 మంది ప్రాణాలు విడిచారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు చాలా దగ్గరగా ఈ ఘటన జరగడం గమనార్హం.
-ప్రఖ్యాత పుణక్షేత్రం తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నడూ లేనివిధంగా జనవరి 8న తిరుపతి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
-యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికుల మధ్య ఢిల్లీలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు.
-గత ఏడాది చివరలో ప్రభుత్వం మారిన సిరియాలో మార్చి 8న అలావైట్ తెగ ప్రజలు నివసించే ప్రాంతంలో కొత్త ప్రభుత్వం దాడి చేసి 1000 మంది పైగా ప్రజలను హతమార్చింది.
-మార్చిలో థాయ్ లాండ్, మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవింది. మయన్మార్ లో 3 వేలమంది పైగా చనిపోయారు.
-ఏప్రిల్ 22న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోని పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు.
-జూన్ నెలలో ఐపీఎల్ టైటిల్ ను తొలిసారి నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత నగరంలో విజయోత్సవం ఏర్పాటు చేయగా తొక్కిసలాట జరిగి 11 నిండు ప్రాణాలు పోయాయి.
-జూన్ 12న అహ్మదాబాద్ లోని విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదంగా నిలిచింది.
-తాజాగా సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడులో 50 మందిపైగా చనిపోయారు. బహుశా తెలుగురాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద పేలుడు ఘటన ఇదేనని అంటున్నారు.
..ఇదీ 2025 ఫస్టాఫ్ విషాదాల సమాహారం..