మనిషి ఆయుష్షు 150 ఏళ్లు.. విటాలీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రపంచంతో పోలిస్తే భారతీయుల ఆయుర్థాయం కేవలం 60 సంవత్సరాలు మాత్రమే.. మన పూర్వీకులు (పురాన గాథలను పక్కన పెడితే) ఎక్కువగా 100 ఏళ్లు.. కొందరు 120 సంవత్సరాలు బతికారు.;

Update: 2025-10-13 18:00 GMT

ప్రపంచంతో పోలిస్తే భారతీయుల ఆయుర్థాయం కేవలం 60 సంవత్సరాలు మాత్రమే.. మన పూర్వీకులు (పురాన గాథలను పక్కన పెడితే) ఎక్కువగా 100 ఏళ్లు.. కొందరు 120 సంవత్సరాలు బతికారు. కానీ నేడు ఆయుర్ధాయం రోజు రోజుకు తగ్గుతుంది. ఒకప్పుడు 100 ఏళ్లు జీవించడం ఒక అద్భుతం. ఇప్పుడు 150 ఏళ్లు జీవించగలమనే ఆలోచన పరిశోధనల వేదికపై నిలుస్తోంది. రష్యా శాస్త్రవేత్త విటాలీ కొవల్యోవ్ ఇటీవల మాట్లాడుతూ ‘150 ఏళ్లు బతకడం ఇక ఊహ కాదు’ అన్నమాట ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కనబరిచింది. ‘150 ఏళ్లు జీవించబోయేవారు ఇప్పటికే పుట్టి ఉన్నారు. వారికి ఇప్పుడు 20 లేదా 30 ఏళ్లు ఉండొచ్చు.’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రకటన కాదు.. ఇది మానవ చరిత్రలోని ఒక లోతైన ఆకాంక్ష. మరణం నుంచి విముక్తి పొందాలనే మానవ ప్రయత్నం ప్రయోగశాలల గోడల మధ్య జరుగుతోంది.

విటాలీ కొవల్యోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

విటాలీ కొవల్యోవ్‌ వోల్గోగ్రాడ్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త. ఆయన ‘వృద్ధాప్యం వెనక్కి తిరగలేని ప్రక్రియ’ అనే సంప్రదాయ భావనను సవాల్‌ చేస్తున్నారు. అతని ప్రకారం.. మానవ కణాల పునరుత్పత్తి సామర్థ్యం, డీఎన్ఏ రిపేర్‌ మెకానిజం, టెలోమియర్‌ పొడవు నియంత్రణ వంటి అంశాలను శాస్త్రం ఇప్పుడు అర్థం చేసుకుంటోంది. ప్రయోగశాలల్లో సెల్‌ రీజెనరేషన్‌, యాంటీ ఏజింగ్ మాలిక్యూల్స్‌, జన్యు మార్పుల ఆధారంగా మన శరీర వృద్ధాప్యం నెమ్మదిగా తిప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కొత్త బయో-ఇంజినీరింగ్‌ సాంకేతికతలు, ‘లాంగివిటీ ఫార్ములాస్‌’, నానోమెడిసిన్‌ అనే రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

150 ఏళ్ల జీవితం విజయమా?

150 ఏళ్లు జీవించడమనే భావన కేవలం వైద్య శాస్త్ర ప్రకారం.. విజయమే కాదు.. అది సమాజం పట్ల దృక్పథం మారిపోయే అంశం. ఒక వ్యక్తి 150 ఏళ్లు జీవిస్తే ఉద్యోగాలు, పింఛన్లు, కుటుంబ సంబంధాలు, జనాభా సవాళ్లు, వనరుల వినియోగం అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇది మానవ చరిత్రలో ఒక జీవన విప్లవం.

వయస్సు పెరగడం అంటే జ్ఞానం పెరగడం అన్న భావన ఉన్నప్పటికీ, దీర్ఘాయువు సమాజంపై మిశ్రమ ప్రభావాన్ని చూపిస్తోంది. ఎక్కువ మంది ఎక్కువ కాలం జీవిస్తే, జనాభా సమతుల్యత, ఆర్థిక స్ధిరత్వం, పర్యావరణ వనరుల వినియోగంపై ఒత్తిడి పెరుగుతుంది. శాస్త్రం మన జీవన ప్రమాణాన్ని పొడిగించగలదేమో కానీ, విలువలను పొడిగించగలదా..? అనేది ఇప్పుడు కొందరికి కలుగుతున్న ప్రశ్న.

ఇది శాపమా..? వరమా..?

150 ఏళ్ల జీవితం వింటే అది ఆశ్చర్యం, కానీ అంత సులభం కాదు.

ప్రస్తుతం మానవుడి జీవన సగటు ఆయుర్దాయం సుమారు 73 సంవత్సరాలు. ఆ సగటును రెట్టింపు చేయాలంటే కేవలం మందులు కాదు జీవన శైలిలో, ఆహారంలో, మానసిక స్థితిలో, ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పు అవసరం. ఎక్కువకాలం జీవించాలా..? లేక మంచి విలువలున్న ప్రస్తుతం ఉన్న జీవితకాలం సరిపోతుందా..? అన్న ప్రశ్న కలుగుతుంది. ఆయుర్ధాయం పొడిగించడం అంటే ఒకవైపు ఆశ, మరోవైపు భారం. అధిక వయసులో ఒంటరితనం, మానసిక అలసట, జీవితంపై ఆసక్తి తగ్గిపోవడం ఇవన్నీ మరో ‘మానవ సంక్షోభం’గా మారవచ్చు.

శాస్త్రానికి సమాంతరంగా..

విటాలీ కొవల్యోవ్‌ వ్యాఖ్యలు ఒక పెద్ద నైతిక చర్చను కూడా తెరపైకి తెచ్చాయి. మానవ వృద్ధాప్యాన్ని ఆపడం అంటే ప్రకృతి నియమానికి విరుద్ధం కాదా? అని. ప్రకృతి నిర్ణయించిన జీవన పరిమితిని మార్చే హక్కు మనిషికి ఉందా? ‘మరణం కూడా జీవన సమతుల్యతలో భాగమే’ అని తాత్త్వికులు చెబుతారు. కానీ శాస్త్రం ఇప్పుడు ఆ సమతుల్యతను పరీక్షిస్తోంది.

150 ఏళ్ల జీవితం శాస్త్రీయంగా సాధ్యమవుతుందేమో.. కానీ అది మనిషి జీవితం యొక్క అర్థం గురించి మళ్లీ ఆలోచింపజేస్తుంది. మరణం భయం లేకుంటే, మనిషి ప్రయత్నం, సృజనాత్మకత, ప్రేమ అన్నీ అర్థం కోల్పోయే ప్రమాదం ఉంది. దీర్ఘాయువు సాధ్యమైతే, మనం కొత్త తరహా విలువలను నేర్చుకోవాలి ఎక్కువ కాలం జీవించడం కాదు, ఎక్కువగా మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. శాస్త్రం ఆయుష్షు పెంచవచ్చు.. కానీ మానవత్వం నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.

Tags:    

Similar News