ఉగ్రదాడి... కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేయబడ్డ జంటలు!
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.;
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోపక్క పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది మాత్రం ప్రాణాలు అరిచేతపట్టుకొని బయటపడ్డారు. ఈ సమయంలో ఊహించని విషయాలు, షాకింగ్ సంగతులు తెరపైకి వస్తున్నాయి.
అవును... మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్ లోని పహల్గాం లో అత్యంత ఘోర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తృటిలో తప్పించుకున్న సెలబ్రెటీ జంట వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... నటి దీపికా కాకర్, తన భర్త షోయబ్ ఇటీవల కశ్మీర్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో పంచుకున్నారు.
అయితే... ఈ దాడి ఘటన తెరపైకి రాగానే వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారికి ఏమైనా అయ్యిందేమోనని ఇన్ స్టాలో మెసేజ్ లు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సెలబ్రెటీ జంట ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాము క్షేమంగానే ఉన్నామని.. మంగళవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నట్లు తెలిపారు.
అక్కడితో ఆగకుండా.. తమ కశ్మీర్ పర్యటనపై వ్లాగ్ చేసినట్లు తెలిపారు. దాన్ని త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో నెటిజన్లు నిప్పులు కురిపించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. ఓ వైపు పెనువిషాదంపై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్ ప్ర చారం చేసుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.
పెళ్లైన ఆరు రోజులకే..!:
తాజాగా కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంటల జీవితాలను కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేశాయి. ఇందులో భాగంగా... హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహ బందంలోకి అడుగుపెట్టగా.. 19న విందు నిర్వహించారు.
అనంతరం భార్యను తీసుకొని కశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 22)న జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ కనిపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
యూపీకి చెందిన ద్వివేదీ పరిస్థితి..!:
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన శుభమ్ ద్వివేదీకి ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహమయ్యింది. ఈ క్రమంలో వృత్తిరీత్యా బిజీగా ఉన్న ఆయన.. తాజాగా తన భార్యను తీసుకొని కశ్మీర్ కు వెకేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలో.. వారు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ముష్కరులు.. తన భర్త తలపై కాల్చి చంపినట్లు అతని భార్య పేర్కొన్నారు.
యూఎస్ నుంచి వచ్చి కశ్మీర్ లో బలి!:
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బితాన్ అధికారిదీ ఇదే ఘోర పరిస్థితి! అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన ఆయన టీసీఎస్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న భార్య, కుమారుడు (3) తో కలిసి స్వదేశానికి వచ్చి, గతవారం వెకేషన్ కు వెళ్లారు. మంగళవారం జరిగిన ఘటనలో ఆయనను ముష్కరులు కాల్చి చంపారు.