2026లో ఏ డిగ్రీలు చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలో తెలుసా?

తాజా నివేదిక ప్రకారం.. కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గ్రాడ్యుయేట్లు భారతదేశంలో అత్యధికంగా ఉపాధి పొందేందుకు అర్హులుగా కొనసాగుతున్నారు.;

Update: 2025-11-23 12:30 GMT

ఏ డిగ్రీ చదివితే ఉద్యోగం తొందరగా వస్తుంది? ఈ ప్రశ్నలు నిత్యం వినిపించేవే, చాలా మందిలో కనిపించేవే! ఈ సమయంలో.. కాలేజీలు, విద్యార్థులు, రిక్రూటర్లు అత్యంత ఉపాధి అవకాశాలున్న డిగ్రీల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పై చర్చ జరుగుతుంటుంది. ఈ సమయంలో తాజాగా "ఇండియా స్కిల్స్ రిపోర్ట్ - 2026" కొన్ని కీలక విషయాలు వెల్లడించింది.

అవును... ఏ డిగ్రీ చేస్తే ఎక్కువ ఉపాధి అవకాశాలకు అవకాశం ఉందనే చర్చ నిత్యం జరిగేదే. అయితే దీనికి సంబంధించిన లెక్కలు ప్రతి ఏటా మారుతున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా ఎంబీయే గురించి చెప్పుకోవచ్చు. గత ఏడాది ఈ డిగ్రీ చేసిన వారి ఉద్యోగ సామర్థ్యం 78%గా ఉండగా.. ఇప్పుడు దాని సామర్థ్యం తగ్గింది. ఇందులో భాగంగా... ఇప్పుడు ఆ సంఖ్య 72.76%గా ఉంది.

సీఎస్, ఐటీ కి బిగ్ ఛాన్స్!:

తాజా నివేదిక ప్రకారం.. కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గ్రాడ్యుయేట్లు భారతదేశంలో అత్యధికంగా ఉపాధి పొందేందుకు అర్హులుగా కొనసాగుతున్నారు. ఈ నివేదిక సీఎస్, ఐటీ గ్రాడ్యుయేట్ల డిమాండ్ ను పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ లను డిగ్రీలతో పాటు నేరుగా అనుసంధానిస్తుందని అంటున్నారు!

ఇదే క్రమంలో... ఎంట్రీ లెవెల్ ప్రతిభ కలిగి ఉన్నవారిలో ఐటీ అగ్రస్థానంలో ఉందని.. మొత్తం ఫ్రెషర్స్ లో 35% మంది ఐటీ ఉద్యోగాలలోకి నియమితులవుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య సీఎస్, ఐటీ గ్రాడ్యుయేట్లు ఇంత స్థిరమైన ఉపాధిని ఎందుకు పొందుతున్నారో వివరిస్తుంది! అయితే కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా.. వీటికి తోడు ఏఐ లేదా క్లౌడ్ వంటి స్పెషలైజేషన్స్ ఉంటే అది మరింత సురక్షితమని అంటున్నారు!

తగ్గుతోన్న ఎంబీయే ఉద్యోగ సామర్ధ్యం!:

వాస్తవానికి గతంలో ఎంబీయే ఉద్యోగ సామర్థ్యం 78%గా ఉండగా... 2026లో దాని ఉద్యోగ సామర్థ్యం 72.76% కి తగ్గింది. తాజా నివేదికలో ఇది ఒక ముఖ్యమైన మార్పు అని చెప్పొచ్చు. అందుకు ప్రధాన కారణం... క్లాసికల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల కంటే అనాలసిస్, టెక్ ఆధారిత కార్యకలాపాలు కలగలిపిన డిజిటల్ అవగాహన ఉన్న ఎంబీయేలను యజమానులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే అని అంటున్నారు. అంటే.. సాధారణ ఎంబీయే ఇకపై సరిపోదన్నమాట!

ఇదే క్రమంలో బీకాం వంటి కామర్స్ కోర్సులకు ఉద్యోగ సామర్థ్యం 62.81% గా ఉండగా.. ఐటీయేతర సైన్స్ కోర్సులకు 61%.. ఆర్ట్స్ కోర్సులకు 55.55%.. ఐటీఐ 45.95%.. పాలిటెక్నిక్ (డిప్లొమా) 32.92% గా ఉందని నివేదిక వెళ్లడించింది.

ఫైనల్ గా ఈ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ - 2026 చెప్పేదేమిటంటే... ఇకపై డిగ్రీ మాత్రమే కీలకం కాదు.. దీనికి సరైన నైపుణ్యాలు తోడవ్వడం కచ్చితంగా అది కీలకం. ఈ క్రమంలో.. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఏఐ కారణంగా సీఎస్ (80%), ఐటీ (78%) ఉపాధి సామర్థ్యాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదే సమయలో డేటా లేదా డోమైన్ బలం జత చేయకపోతే ఎంబీయే బ్రైట్ నెస్ తగ్గుతుంది!

Tags:    

Similar News