లేఆఫ్ లో కొత్త విధానం.. అమెరికా చేస్తుంది ఇదే..?
ఒకప్పుడు ఉద్యోగం కోల్పోవడం అంటే మేనేజర్ గదిలోకి పిలిపించి మాట్లాడే ఒక సహజ కార్యక్రమం ఉండేది.;
ఒకప్పుడు ఉద్యోగం కోల్పోవడం అంటే మేనేజర్ గదిలోకి పిలిపించి మాట్లాడే ఒక సహజ కార్యక్రమం ఉండేది. కనీసం కొన్ని మాటలు ధైర్యంగా నైనా చెప్పేవారు. షెక్ హ్యాండ్.. మేమున్నామని, ‘క్షమించండి, కానీ..’ అన్న మాటలు ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు కాస్త ఊరడింపుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మాటలు, చేతలు సిలికాన్ సర్వర్లలో కరిగిపోయాయి. అమెరికాలోని పెద్ద పెద్ద సంస్థలు, ముఖ్యంగా అమెజాన్, టార్గెట్, మెటా, గూగుల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఉద్యోగ కోతలను ‘మానవ సంబంధం’ లేని యాంత్రిక ప్రక్రియగా మార్చేశాయి. ఉద్యోగం కోల్పోయిన వారు కనీసం ఆఫీస్ తలుపు తట్టాల్సిన అవసరం లేదు. ఒక మాస్ ఈమెయిల్ చాలు. లేదా ఒక ప్రీ-రికార్డెడ్ ఆడియో మెసేజ్. కొందరికి ‘మీ యాక్సెస్ నిరాకరించబడింది’ అని వచ్చే సిస్టమ్ నోటిఫికేషన్ కూడా. వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. ఈ మాస్ కమ్యూనికేషన్ లేఆఫ్ కల్చర్ అమెరికన్ ఉద్యోగ ప్రపంచాన్ని ఒక వైపునకు తిప్పుతున్నాయి.
వివిధ కారణాలతో కంపెనీలు..
ఈ విధానానికి కంపెనీలు చెప్పే కారణం సామర్థ్యం. పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించినప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఇతరులతో మాట్లాడేందుకు సమయం తీసుకుంటాడు. ఆఫీస్ వాతావరణంలో కొన్ని లీకులు జరుగుతాయి, భావోద్వేగ ప్రతిచర్యలు ఆఫీస్ ఎన్విరాన్ మెంట్ ను పొల్యూట్ చేస్తాయి. కాబట్టి ఒక మాస్ ఈమెయిల్.. లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్క క్షణంలోనే క్లీన్ చేయవచ్చని భావిస్తున్నారు. మేనేజ్‌మెంట్ దృష్టిలో ఇది కంట్రోల్ ఉద్యోగుల దృష్టిలో మాత్రం ఇది క్రూరత్వం.
ఉద్యోగం తొలగింపును కూడా సిల్లీగా చేస్తున్ వైనం..
సామాన్యంగా ఉద్యోగం కోల్పోవడం ఒక వ్యక్తికి మానసికంగా అత్యంత కఠినమైన దశ. జీవితం, కుటుంబం, స్వాభిమానంపై ప్రభావం చూపే ఘటన. కానీ ఒక కూల్ ఇమెయిల్ ద్వారా ‘మీ సేవలు ఇక అవసరం లేదు’ అనే లైన్ రాయడం అంటే మానవత్వాన్ని కోల్పోయిన యాంత్రిక యాజమాన్య సంస్కృతి. హ్యూమన్ రిసోర్సెస్ నిపుణులు చెబుతున్నారు. ‘ఉద్యోగాన్ని తీసివేయడం కంటే, గౌరవాన్ని తీసివేయడం ప్రమాదకరం.’
ఈ ధోరణి ఒక పెద్ద మానసిక మార్పునకు కారణంగా నిలుస్తుంది. మహమ్మారి తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి తెచ్చిన డిజిటల్ దూరం.. ఇప్పుడు ఎంపతి ఫ్రమ్ ఆఫీస్ రూపంలో కనిపిస్తోంది. వ్యక్తిగత సంబంధాలు, ఆత్మీయత, సహోద్యోగుల అనుబంధం అన్నీ క్రమంగా ‘డేటా మేనేజ్‌మెంట్’ అయిపోయాయి. ఉద్యోగులను ఇక మానవులుగా కాకుండా ‘సిస్టమ్‌లోని యూజర్ ఐడీలు’గా చూస్తున్న కార్పొరేట్ వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతోంది.
కార్మికుల నిబద్ధతను కాపాడుకోవడం ముఖ్యమే..
సామర్థ్యాన్ని కాపాడుకోవడంలో కంపెనీలు సరిగానే ఉండవచ్చు. మార్కెట్ ఒత్తిడి, షేర్‌హోల్డర్ల డిమాండ్లు, లాభాల లెక్కలతో వారికి ఉన్న బాధ్యత వాస్తవమే. కానీ అదే సమయంలో, కార్మికుల మనసు, వారి నిబద్ధత, నమ్మకం వంటి అంశాలు కూడా ఒక సంస్థ దీర్ఘకాలిక మూలధనమే. ఒక కూల్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగిని తొలగించడం తాత్కాలికంగా కంపెనీకి లాభమైనా.. దీర్ఘకాలంలో అది కంపెనీని కూల్చేస్తుంది.
మానవత్వం లేకుండా ‘హ్యూమన్ రిసోర్సెస్’ అంటే ఏమిటి? సంస్థలు తమ పని వేగంగా జరగాలని ఎలా కోరుకుంటాయో ఉద్యోగులు కూడా తమ గౌరవాన్ని కోరుకుంటారు. టెక్నాలజీ వేగం పెంచినా, భావోద్వేగం తగ్గించడం ఏ సంస్థకీ విజయం ఇవ్వదు. ప్రపంచం డిజిటల్ అవుతోంది, కానీ పని కోల్పోయే క్షణంలో ఒక మనసు ఇంకా మానవమైన సాంత్వన కోసం ఎదురుచూస్తోంది.