935 పోస్టులకు 9.7 లక్షల దరఖాస్తులు !
ఉద్యోగం మనిషి లక్షణం అనాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే పురుష లక్షణం అంటే లింగ వివక్ష అవుతుంది కాబట్టి. ఇక ఉద్యోగం అంటే ఈ రోజుకీ ఒక బలమైన నమ్మకం ఉంది.;
ఉద్యోగం మనిషి లక్షణం అనాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే పురుష లక్షణం అంటే లింగ వివక్ష అవుతుంది కాబట్టి. ఇక ఉద్యోగం అంటే ఈ రోజుకీ ఒక బలమైన నమ్మకం ఉంది. అదేంటి అంటే ప్రభుత్వం కొలువులోనే సంపాదించినదే ఉద్యోగం అని. అలా అయితేనే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అన్నది అందరిలోనూ ఎక్కువగా ఇప్పటికీ ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు అది అటెండర్ ఉద్యోగం అయినా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు సైతం దరఖాస్తు చేసేస్తున్నారు. దాంతో ఇది ఉద్యోగం అవసరమే కాదు నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియచేస్తోంది.
ఒక పోస్టుకు వేయి మంది :
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజగా ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. 2026 జనవరిలో అసిస్టెంట్ ఎద్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు నియామకం కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేస్తే దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. అంతే కాదు ఉన్న పోస్టులకు వేయి రెట్లు అప్లికేషన్లు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి అధికారుల వంతు అయింది అంటున్నారు. ఖాళీగా ఉన్న 935 పోస్టులకు గానూ 9.7 లక్షల దరఖాస్తులు వచ్చాయని బీపీఎస్సీ అధికారులు వెల్లడించడం విశేషం. అంతే కాదు ఇక గడువు ముగుస్తోంది అనగానే చివరి అయిదు రోజులలో రోజుకు సగటున 75 వేల నుంచి 85 వేల దాకా దరఖాస్తులు రావడంతో వారే షాక్ తిన్నారని అంటున్నారు.
జీతభత్యాలు ఇవే :
ఇక ఈ పోస్టుకు లెవెల్ 5 పే కమిషన్ ప్రకారం జీతాలు ఇస్తారు. అల ఈ పోస్టుకు ఎంపిక అయిన వారికి 29,200 రూపాయలు నెల జీతం వస్తుంది. అంతే కాదు మొత్తం 935 పోస్టులలో 319 మహిళలకు రిజర్వ్ అయిపోయాయి. అలాగే స్వాతంత్ర సమరయోధుల వారసులకు, దృష్టి లోపం ఉన్న వారికి చెవిటి మూగవారికి కూడా కొన్ని పోస్టులు రిజర్వ్ చేసారు. దాంతో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయో ఎవరికీ తెలియని విషయంగా ఉంది. అయినా సరే ఈ పోస్టుల కోసం దరఖాస్తులు లక్షలలో వచ్చాయి అంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలో అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.
రికార్డు అదేనా :
ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. అదే సమయంలో సర్కారీ కొలువుల మీద వ్యామోహం మాత్రం అంతకంతకు ఎక్కువ అయిపోతోంది. దానికి కారణం ఒకసారి జీవితంలో కష్టపడి ప్రభుత్వం ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ మొత్తానికి ఒక భరోసా ఉంటుందని అందరూ భావించడమే. అంతే కాదు ఐటీ ఫీల్డ్ లో జాబ్స్ తగ్గిపోతున్న నేపథ్యం ఉంది. అలాగే ఏఐ ప్రభావం ఏ స్థాయిలో ఉద్యోగ కొరత సృష్టిస్తుందో తెలియని వాతావరణం ఉంది. దాంతో జీతం తక్కువ అయినా స్థిరత్వం కోసమే అంతా చూస్తున్నారు. దాంతో పాటు ఏటా వివిధ డిగ్రీలు చేత బుచ్చుకుని కాలేజీ గేటు దాటి బయటకు వస్తున్న వారు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. ఉద్యోగాలు అయితే లక్షలలో కూడా లేవు సరికదా వేలలలో సైతం భర్తీ చేయడం లేదు దాంతో ఏ ఒక్క ఖాళీ కనిపించినా నిరుద్యోగులు ఎగబడుతున్నారు దాంతోనే రికార్డులు బద్ధలు అవుతున్నాయి. మరి దీనిని ప్రగతి అందామా లేక మన చదువులు స్వయం ఉపాధి బతుకుకు ధీమా ఇవ్వలేకపోతున్నాయని చింతిద్దామా అంటే ఎవరికి వారే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.