35 బిలియన్ డాలర్లు.. 10 లక్షల ఉద్యోగాలు.. భారత్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు
భారతదేశంలో భారీ పెట్టుబడికి అమెజాన్ అతిపెద్ద ప్లాన్ వేసింది. ఇండియన్ టెక్నాలజీ రంగంలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడుల్లో ఒకటిగా ఇది నిలిచింది.;
భారతదేశంలో భారీ పెట్టుబడికి అమెజాన్ అతిపెద్ద ప్లాన్ వేసింది. ఇండియన్ టెక్నాలజీ రంగంలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడుల్లో ఒకటిగా ఇది నిలిచింది. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారత మార్కెట్ లో మరో 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.9 లక్షల కోట్లు) భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇప్పటికే భారత్ లో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన అమెజాన్ ఈ అదనపు మెగా పెట్టుబడిని 2030 నాటికి ప్రకటించింది. ఈ కీలక పెట్టుబడులు ప్రధానంగా మూడు వ్యూహాత్మక లక్ష్యాలపై కేంద్రీకృతమవుతాయని సంస్థ స్పష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టి .. ఈ మూడు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. అమెజాన్ ప్రకటన చేయడానికి ముందు రోజే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం భారత్ లో 17.5 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల పెట్టుబడిని ప్రకటించడం గమనార్హం. ఈ వరుస పెట్టుబడులు భారత్ ను గ్లోబల్ టెక్ హబ్ గా మరింత బలోపేతం చేయనున్నాయి.
అమెజాన్ తన తాజా పెట్టుబడితో 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడం .. భారత్ నుంచే 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను టార్గెట్ గా పెట్టుకుంది. 15 మిలియన్ చిన్న వ్యాపారులకు ఏఐ ప్రయోజనాలను అందించడం.. వేల కోట్ల మంది వినియోగదారులకు ఆధునిక డిజిటల్ సేవలు.. 4 మిలియన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్య , కెరీర్ అవగాహన కల్పించడం ధ్యేయంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘గత 15 ఏళ్లుగా భారత్ డిజిటల్ విప్లవంలో భాగస్వాములమై ఉండడం మాకు గర్వకారణం అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్-వికసిత్ భారత్’ లక్ష్యాలను మా వృద్ధి సరిపోయేలా సాగుతోంది. దేశీయ ఉత్పత్తులను గ్లోబల్ గా తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
భారత్ నుంచి అమెజాన్ ద్వారా 20 బిలియన్ విలువైన ఎగుమతులు విజయవంతంగా జరిగాయి. ఇప్పుడు అదే సంఖ్యను నాలుగు రెట్లు పెంచి 2030 నాటికి 80 బిలియన్ ఎగుమతులు సాధించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అమెజాన్ ‘యాక్సిలరేట్ ఎక్స్ పోర్ట్స్’ అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇది దేశీయ మాన్యు ఫ్యాక్చరర్లు, డిజిటల్ ఎంట్రప్రెన్యూర్లను అనుసంధానం చేసే ఒక సమగ్ర కార్యక్రమంగా పనిచేస్తుంది. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 10కిపైగా కేంద్రాల్లో ఆన్ గ్రౌండ్ డ్రైవ్స్ నిర్వహించనున్నారు. వీటిలో తిరుపూర్, కాన్పూర్, సూరత్ లు ప్రముఖంగా ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అపెరల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అమెజాన్ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
ఇక ఇటు అమెజాన్, అటు మైక్రోసాఫ్ట్ సంస్థల వరుస మెగా పెట్టుబడులు భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ , క్లౌడ్ డిజిటల్ ఎకానమీ కేంద్రంగా మార్చే దిశగా చేస్తున్న కీలక అడుగులుగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పెట్టుబడులు స్టార్టప్ ఎకోసిస్టమ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్, స్కిల్ డెవలప్ మెంట్ రంగాలకు గణనీయమైన ఊపునిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.