ద్రాక్షా గింజలతో టాబ్లెట్... 150 ఎళ్లు జీవించడం వాస్తవికమైనదే!
ఈ దశాబ్ధంలో ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ & టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తుండగా.. మరోవైపు సైన్స్ విభాగంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.;
ఈ దశాబ్ధంలో ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ & టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తుండగా.. మరోవైపు సైన్స్ విభాగంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మనిషి 150 సంవత్సరాల వరకూ జీవించడం అనేది వాస్తవికమైనదే అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఇటీవల చైనా ప్రభుత్వ టెలివిజన్ మైక్రోఫోన్ లో చైనా అధినేత జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ... మనిషి 150 ఏళ్లు బహుశా శాశ్వతంగా జీవించే అవకాశం గురించి చర్చించారు! దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. అది సాధ్యమే అంటుంది ఓ లాంగ్ లైఫ్ మెడికల్ స్టార్టప్!
చైనాలోని షెన్ జెన్ లోని లాంగ్ లైఫ్ మెడికల్ స్టార్టప్ అయిన లోన్వీ బయోసైన్సెస్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లియు క్వింగ్హువా స్పందిస్తూ... మనిషి 150 సంవత్సరాల వరకు జీవించడం ఖచ్చితంగా వాస్తవికమైనదని తెలిపారు. ద్రాక్ష గింజల సారంలో లభించే సమ్మేళనం ఆధారంగా యాంటీ ఏజింగ్ మాత్రలను అభివృద్ధి చేసిన ఈ కంపెనీ చీఫ్.. కొన్ని ఏళ్లలో ఇది వాస్తవం అవుతుందని అన్నారు!
ఈ నేపథ్యంలో షాంఘైలో ఇప్పటికే ఎలుకలపై చేసిన తొలి పరీక్షల్లో వాటి ఆయుర్ధాయం 9 శాతం పెరిగిందని చూపిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మాత్రలు ద్రాక్షా విత్తనాల నుంచి వేరు చేయబడిన ప్రోసైనిడిన్ సీ1 (పీసీసీ1) అనే అణువును కేంద్రీకరిస్తాయని.. ఇది ఇప్పటికే ఎలుకల్లో ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడిందని చెబుతున్నారు!
ఇలా షాంఘై బ్బృందం పీసీసీ1పై తన పరిశోధనలను విడుదల చేసిన అనంతరం 2022లో లోన్వీ బయోసైన్సెస్ తన ప్రధాన ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ సీఈఓ ఇప్ ఝూ... జెరోసైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఫలితంగా, మరణాన్ని వాయిదా వేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఐదు పదేళ్లలో ఎవరూ క్యాన్సర్ తో బాధపడరని కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో... బయోటెక్, ఏఐ, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో పశ్చిమ దేశాలను అధిగమించాలని ఆసక్తిగా ఉన్న చైనా.. దీర్ఘాయువు పరిశ్రమను జాతీయ ప్రాధాన్యతగా మార్చిందని.. దీనికి సంబంధించిన పరిశోధన, సంబంధిత వాణిజ్య ప్రయోజనాల కోసం బిలియన్లు కుమ్మరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా... చైనా ప్రభుత్వ అధికార పత్రిక ది పీపుల్స్ డైలీ ప్రకారం... గత సంవత్సరం చైనా ప్రజల సగటు ఆయుర్దాయం 79 సంవత్సరాలకు చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువే అయినప్పటికీ... ఆరోగ్య సంరక్షణ, జీవనశైలిలో స్థిరమైన మెరుగుదల ద్వారా సాధించిన జపాన్ సగటు ఆయుర్దాయం సుమారు 85 కంటే వెనుకబడి ఉండటం గమనార్హం.