బెల్లం ఉందిగా.. షుగర్ కు గుడ్ బై చెప్పేయొచ్చు

పంచదార మాదిరి బెల్లాన్ని వినియోగిస్తే ఎలాంటి హాని చేయకపోగా.. లాభం చేస్తుంది.;

Update: 2025-12-01 05:30 GMT

స్వీటు ప్రియులకు తీపితో ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. పంచదారతో తయారు చేసే మిఠాయిలు మొదలుకొని టీ కాఫీల వరకు ఆరోగ్యానికి హానికరంగా చెబుతుంటారు. మరి.. షుగర్ కు ప్రత్యామ్నాయం లేదా? అంటే బెల్లం ఉందిగా అని చెప్పొచ్చు. పదేళ్ల క్రితం పంచదారకు బదులుగా బెల్లంతో టీ తాగితే అన్న మాట చెబితే ఛీ.. ఛీ.. అంటూ మొహం అదోలా పెట్టేసే పరిస్థితి. మారిన కాలానికి తగినట్లుగా బెల్లం చేసే మేలు తెలియటమే కాదు.. పంచదార చేసే హాని గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది.

దీంతో.. పంచదారకు బదులుగా బెల్లాన్ని వినియోగిస్తున్న తీరు అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే బెల్లం ఛాయ్ దుకాణాలకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. నిజంగానే బెల్లంతో కలిగే మేలు ఎంత? బెల్లం చేసే ప్రయోజనాలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. బెల్లంతో ప్రేమలో పడిపోకుండా ఉండలేం. ఎందుకంటే అంతలా మేలు చేసే గుణం దాని సొంతం.

పంచదార మాదిరి బెల్లాన్ని వినియోగిస్తే ఎలాంటి హాని చేయకపోగా.. లాభం చేస్తుంది. బెల్లంలో క్యాల్షియం.. ఐరన్.. మెగ్నీషియం.. పొటాషియం.. భాస్వరం.. జింక్.. సెలీనియం.. విటమిన్లు ఉంటాయి. ఆయుర్వేదంలో బెల్లం.. తాటిబెల్లాన్ని ఎక్కువగా వినియోగించటం చూస్తున్నదే. బెల్లం తింటే రోగనిరోధక శక్తి పెరగటమేకాదు జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలను అరికడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో బెల్లాన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

ఊబకాయాన్ని నిరోధించటమే కాదు.. ఎముకలు.. దంతాలు పటిష్టంగా ఉంటాయి. బెల్లంలో కాస్తంత అల్లం నూరి.. తీసుకుంటే కీళ్ల నొప్పులు.. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. ఉబ్బసం.. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరటంలాంటి సమస్యల్ని తగ్గించే గుణం బెల్లంలో ఉంది. రక్తాన్ని శుద్ధి చేయటం.. శరీరంలో చేరిన మలినాల్ని బయటకు పంపేసే గుణం బెల్లం సొంతంగా చెబుతారు. అంతేకాదు.. కాలేయానికి కూడా మేలు చేస్తుందన్నది నిపుణుల మాట. అందుకే.. పంచదారకు బదులుగా బెల్లాన్ని తగిన మోతాదులో వాడటంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. రోజువారీగా తాగే నాలుగైదు కాఫీల్లో కానీ టీల్లో కానీ మిస్ కాకుండా బెల్లంతో వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నది మరవొద్దు.

Tags:    

Similar News