ఒకే రోజు ఓటీటీతోపాటు టీవీలో.. ట్రెండ్ కంటిన్యూ!
అలా రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు మూవీగా సీనియర్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది.;
ఒకే రోజు ఓటీటీలో.. టీవీలో.. కొద్ది రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా జీ5 సంస్థ ఇలా చేస్తోంది. ఓటీటీలోనేమో జీ5 ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. టీవీలోనేమో జీ ఛానెల్ లో ప్రీమియర్ వేస్తోంది. ఇప్పటికే పలు సినిమాల విషయంలో అదే చేసింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీని ఒకే రోజు ఓటీటీలో, టీవీలో రిలీజ్ చేసింది.
అలా రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు మూవీగా సీనియర్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. మార్చి 1న జీ5తో పాటు జీ తెలుగులో అలరించింది. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన రాబిన్ మూవీ కూడా అలాగే రిలీజ్ అయింది. ఓటీటీలో, టీవీలో ఒకే రోజు వచ్చింది.
ఇప్పుడు అదే కోవలోకి మరో మూవీ చేరనుంది. కోలీవుడ్ నటీనటులు సూరి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన మామన్ మూవీ.. ఒకే రోజు అటు జీ5 ఓటీటీలో.. ఇటు జీ తమిళ ఛానెల్ లో సందడి చేయనుంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయని జీ5 నిర్వాహకులు.. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే డేట్ ను ప్రకటించనున్నారట.
అయితే ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన మామన్ చిత్రం మే 16న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంది. A-సెంటర్ ఆడియన్స్ కు బాగా ఎక్కకపోయినా.. B, C సెంటర్లలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా మూవీ రూపొందడమే అందుకు కారణం.
కాగా, మామన్ మూవీ ఓటీటీ హక్కులు , టెలివిజన్ హక్కులను జీ 5, జీ తమిళ్ సొంతం చేసుకున్నాయి. అయితే రీసెంట్ గా జీ ఎంటరైన్మెంట్స్ సంస్థ మామన్ మూవీ ఓటీటీ విడుదల, టీవీ ప్రీమియర్ ఒకేసారి జరుగుతాయని అధికారికంగా ప్రకటించింది. దీంతో చాలా మంది ట్రేడ్ విశ్లేషకులు కొత్త వ్యూహాం బాగుందని చెబుతున్నారు.
ఎందుకంటే జీ 5 ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేని వారు.. టీవీలో చూస్తారు. అప్పుడు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. అది వైరల్ గా మారితే.. ఓటీటీలో అందరూ చూసేందుకు మొగ్గు చూపుతారు. దీంతో వ్యూస్ పెరుగుతాయి. అలా ఒకే రోజు ఓటీటీ, టీవీలో రిలీజ్ చేసే వ్యూహం సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. భవిష్యత్తులో అనేక టీవీ, OTTలు ఆ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.