స్పై వర్సెస్ స్పై.. ఈ అనంతమైన యుద్ధంలో గెలుపెవరిది?
యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `ఆల్ఫా` చిత్రంలో ఇద్దరు అత్యంత నైపుణ్యం కలిగిన ఎలైట్ ఫీమేల్ సూపర్-ఏజెంట్ల మధ్య సాగే పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `ఆల్ఫా` చిత్రంలో ఇద్దరు అత్యంత నైపుణ్యం కలిగిన ఎలైట్ ఫీమేల్ సూపర్-ఏజెంట్ల మధ్య సాగే పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో ఆలియా భట్ `సీత` (ఆల్ఫా) అనే అత్యంత ప్రమాదకరమైన హంతకురాలిగా.. ఒంటరి పోరాటాలు చేసే ఏజెంట్‌గా కనిపిస్తుంది. బాబీ డియోల్ పోషించిన `ఫతే` అనే క్యారెక్టర్ చేతిలోనే పెరిగి అతడినే తండ్రిలా భావించే సీత.. ఒకానొక దశలో `ఆల్ఫా` ప్రోగ్రామ్ వెనుక ఉన్న చీకటి నిజాన్ని తెలుసుకుని తిరుగుబాటు చేస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి శర్వరి పోషిస్తున్న మరో మిస్టీరియస్ సూపర్-ఏజెంట్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆలియాను పట్టుకోవాలనే లక్ష్యంతో వచ్చే శర్వరి పాత్రకు.. ఆలియా పాత్రకు మధ్య ఉండే కనెక్షన్ సినిమాకే హైలైట్‌గా మారనుంది.
మొదట్లో ఈ ఇద్దరు అందాల ముద్దుగుమ్మల మధ్య స్క్రీన్‌పై ఒక భీకరమైన `టగ్ ఆఫ్ వార్` (పోటాపోటీ) వాతావరణం కనిపిస్తుంది. ఒకరినొకరు మట్టుబెట్టుకోవాలనే కసితో వీరిద్దరూ తలపడే యాక్షన్ సెక్వెన్స్, కత్తులు దూసుకునే ఘట్టాలు ప్రేక్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. ఇద్దరు బాలీవుడ్ టాప్ గ్లామర్ భామలు ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కొట్టుకుంటుంటే థియేటర్లలో తెర నిండుగా హై-వోల్టేజ్ గ్లామర్ విందుతో పాటు కళ్లు చెదిరే యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ ఆకట్టుకోవడం ఖాయం. ఈ ఇద్దరి మధ్య సాగే `స్పై వర్సెస్ స్పై` వార్ ప్రేక్షకులలో మునుపెన్నడూ లేని సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
అయితే ఈ అనంతమైన యుద్ధంలో అసలు మలుపు ఇద్దరూ తమ కామన్ ఎనిమీ (ఉమ్మడి శత్రువు) ఎవరో తెలుసుకున్నప్పుడు వస్తుంది. తమను పెంచి పెద్ద చేసిన మెంటర్ ఫతే (బాబీ డియోల్) తమ పాలిట విలన్‌గా మారాడని గ్రహించిన తర్వాత ఆలియా-శర్వరి తమ మధ్య ఉన్న విభేధాలను పక్కన పెడతారు. ఎలాగైనా ఫతేను అంతం చేయడమే లక్ష్యంగా ఇద్దరు లేడీ సూపర్-ఏజెంట్లు చేతులు కలిపి ఒక టీమ్‌గా ఏర్పడతారు. మొదట్లో ఒకరినొకరు ముంచేసుకోవాలని చూసిన ఈ ఇద్దరు భామలు... చివరికి కలిసికట్టుగా శత్రువుపై ఎలా విజయం సాధించారనేదే `ఆల్ఫా` చిత్రంలోని అసలైన క్లైమాక్స్.
నేపోకిడ్ ఆలియా డామినేట్ చేస్తోందా?
స్పై వర్స్ లోని `ఆల్ఫా` టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో భిన్నమైన స్పందనను రాబట్టింది. టీజర్‌లో ఆలియా భట్ యాక్షన్ అవతార్, విలన్‌గా బాబీ డియోల్ పవర్‌ఫుల్ లుక్ అందరినీ ఆకట్టుకున్నా... సినిమాలో మరో ప్రధాన పాత్రధారి అయిన శర్వరి వాగ్ ఎక్కడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు శర్వరి ఎక్కడ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ, ఇది కేవలం ఆలియా సోలో ప్రోమోలా ఉందంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆన్‌లైన్ ట్రోల్స్‌కు నటి ఆలియా భట్ ఎంతో తెలివిగా చమత్కారంగా చెక్ పెట్టింది.
బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శర్వరితో కలిసి దిగిన క్రేజీ ఫొటోలను షేర్ చేసిన ఆలియా నెటిజన్ల ప్రశ్ననే రివర్స్ చేస్తూ.. `వేర్ ఈజ్ శర్వరి?` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి శర్వరి కూడా అంతే ఫన్నీగా ``ప్రెజెంట్టూ మేడమ్!!!`` అని రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శివ్ రావైల్ దర్శకత్వంలో, ఆదిత్య చోప్రా నిర్మాణంలో వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌పై భారీ అంచనాలతో జూలై 3న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌లో శర్వరి లేకపోయినా...రియల్ లైఫ్‌లో తామిద్దరం ఎంతో క్లోజ్ అని ఈ `ఆల్ఫా` గర్ల్స్ నిరూపించడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.