వెండి తెర‌పై న‌వ‌త‌రం రైతులే వీళ్లంతా!

పాత త‌రం హీరోల్లో రైతు పాత్ర‌లు పోషించ‌ని న‌టులంటూ లేని వారుండరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు త‌రం న‌టులంతా నాగ‌లి పట్టి పొలం దున్నిన వారే.;

Update: 2026-03-02 10:30 GMT

పాత త‌రం హీరోల్లో రైతు పాత్ర‌లు పోషించ‌ని న‌టులంటూ లేని వారుండరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు త‌రం న‌టులంతా నాగ‌లి పట్టి పొలం దున్నిన వారే. ఆ త‌ర్వాత త‌రం న‌టులైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లు సైతం రైతు పాత్ర‌ల్లో మెప్పించారు. ఇక్క‌డితో రైతు పాత్ర‌లు ఆగిపోలేదు. తరాలు మారినా రైతు పాత్ర‌ల‌కు వ‌న్నె త‌గ్గ‌లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక బాధ్యత ఉన్న కథలను ఎంచుకోవడంలో నేటి తరం యువ హీరోలు ముందుంటున్నారు. దేశానికి వెన్నెముక అయిన 'రైతు' పాత్రలో నటించి, వ్యవసాయం గొప్పతనాన్ని చాటిచెప్పిన యువ హీరోలున్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ `మ‌హ‌ర్షి`లో నాగ‌లి ప‌ట్టి పొలం దున్ని, మొక్క నాటిన స‌న్నివేశాలున్నాయి. సాప్ట్ వేర్ కంపెనీ సీఈవో పొలం దున్నితే వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ద్వారా వ్యవసాయం అనేది కేవలం వృత్తి కాదు. అది ఒక బాధ్యత అని చాటి చెప్పారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. అలాగే `శ్రీకారం` సినిమాలో యువ హీరో శ‌ర్వానంద్ కూడా సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వ‌దిలేసి ఆధునిక ప‌ద్ద‌తుల్లో వ్య‌వ‌సాయం చేసి గ్రామ ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే యువ రైతుగా ఆక‌ట్టుకున్నాడు. శ‌ర్వానంద్ కెరీర్ లో ఇదొక ఐకానిక్ రోల్ గా నిలిచిపోతుంది.

యువత మళ్ళీ వ్యవసాయం వైపు రావాలనే సందేశాన్ని ఈ సినిమా బలంగా ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్ నటించిన `రిపబ్లిక్` నేరుగా రైతు సినిమా కాకపోయినా, ఒక కలెక్టర్‌గా ఆయన రైతుల సమస్యల కోసం, కలుషితమైన చెరువుల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూముల కోసం చేసే పోరాటం రైతులకు అండగా నిలిచింది. ఇందులో ఆయన రైతు బిడ్డగా చాలా సహజంగా నటించారు. అలాగే అల్ల‌రి న‌రేష్ `మ‌హ‌ర్షి`లో రైతు ఉద్య‌మం చేయ‌డం, `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం` అటవీ ప్రాంత రైతులకు అండగా నిలిచే ఎన్నికల అధికారిగా మెప్పించాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` లో కొన్ని స‌న్నివేశాలు పల్లెటూరి రైతు కుటుంబానికి దగ్గరగా ఉంటాయి. కోలీవుడ్ హీరో కార్తీ `చిన‌బాబు` సినిమాలో పూర్తిస్థాయి రైతు పాత్రలో నటించాడు. వ్యవసాయం పట్ల గౌరవం, రైతు కట్టుబాట్లను ఆయన ఎంతో గర్వంగా ప్రదర్శించారు. తాజాగా ధ‌నుష్ కూడా రైతు అవ‌తారం ఎత్తాడు. విగ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నఓ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో ధ‌నుష్ స్వ‌చ్ఛ‌మైన రైతు పాత్ర పోషిస్తున్నాడు. ఇంత వ‌ర‌కూ రైతు పాత్ర‌లో ధ‌నుష్ క‌నిపించ‌లేదు. ఈ పాత్ర విష‌యంలో ధ‌నుష్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News