హింసను ఆమోదించే సమాజం.. శృంగారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుండి శృంగారు సన్నివేశంపై పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుండి శృంగారు సన్నివేశంపై పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సన్నివేశంపై చిత్రంలో భాగమైన బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. టీజర్‌లో కనిపించిన సన్నివేశంపై ప్రేక్షకులు, కొన్ని రాజకీయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. టీజర్‌లో అత్యంత క్రూరమైన హింస, రక్తపాతం, చైన్-సా తో తల నరికేసే భీకరమైన దృశ్యాలను చూసి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
కానీ ఇద్దరు వ్యక్తులు శృంగారంలో ఉన్నట్లుగా చూపిస్తేనే ఎందుకు ఇంత రచ్చ జరుగుతోందని ప్రశ్నించారు. సినిమాల్లో హింసను వినోదం గా భావించే మనం మానవ సంబంధాల్లోని అత్యంత సహజమైన శృంగార ప్రక్రియను అశ్లీలంగా చూడటం వెనుక ఉన్న వికృత మనస్తత్వాన్ని ఎత్తిచూపారు. ఈ వివాదం కేవలం ఆన్‌లైన్ చర్చలకే పరిమితం కాలేదు. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం టీజర్ అశ్లీలతతో ఉందని ఇది మహిళలు, పిల్లల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు కూడా చేసింది.
అంతకుముందు కూడా టీజర్‌లో మతపరమైన చిహ్నాలను (ఆర్కేంజెల్ మైఖేల్ విగ్రహం) స్మశానవాటికలో ఉన్నట్లు చూపడంపై నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనల వల్ల టీజర్‌లో నటించిన నటి బీట్రిజ్ టౌఫెన్‌బాచ్‌పై తీవ్రమైన సోషల్ మీడియా దాడి జరిగింది. ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నెటిజన్లు చేసిన ట్రోల్స్, అభ్యంతరకరమైన వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియా ఖాతాలను మూసివేయాల్సి వచ్చింది. సినిమాలోని సన్నివేశాన్ని విమర్శించడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత స్థాయికి వెళ్లి ట్రోల్ చేయడం ఆమోదయోగ్యం కాదని పరిశ్రమలోని కొందరు ప్రముఖులు వాదిస్తున్నారు.
'టాక్సిక్' అనేది పేరుకు తగ్గట్టుగానే వివాదాలతో మొదలైనప్పటికీ దీనిపై వస్తోన్న విమర్శలను ఎలా ఎదుర్కోవాలో? మేకర్స్ సందిగ్ధంలో ఉన్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ వైవిధ్యమైన ప్రయోగాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తుంటే సమాజంలోని కొన్ని వర్గాలు మోరల్ పోలీసింగ్ పేరుతో సినిమా కంటెంట్‌ను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాయని గారెట్ మండిపడ్డారు. స్వేచ్ఛా కళాసృష్టికి .. సామాజిక ఆంక్షలకు మధ్య ఉన్న సంఘర్షణ ఎప్పటికీ ముగియని చర్చగా మారిందన్నారు.
హింసను చూసి అలవాటుపడిన ప్రేక్షకులు శృంగారాన్ని అశ్లీలతగా చూడటం అనేది పెరిగిన సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా పేర్కొన్నారు. సినిమా అనేది సమాజానికి అద్దం పడుతుందని అంటుంటాం. కానీ ఆ అద్దంలో నచ్చనిది కనిపిస్తే దాన్ని విమర్శించడం సులభం, ఆ వికృతత్వాన్ని అంగీకరించడం కష్టమన్నారు. 'టాక్సిక్' సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందన వస్తుందో? ఈ వివాదాలు చిత్రంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.