టాక్సిక్ ఈవెంట్: యష్ ఎంత తోపో ఈ తోపులాటలు చూస్తే తెలుస్తుంది!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్`.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్`. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో అత్యంత భారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కెజియెఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ ఈవెంట్ నిరూపించింది.
ఈవెంట్ ప్రాంగణంలో యువత హడావుడి మామూలుగా లేదు. సాధారణంగా స్టార్ హీరోల ఈవెంట్లకు మేల్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు... కానీ ఈసారి అనూహ్యంగా భారీ సంఖ్యలో మహిళా అభిమానులు, కాలేజ్ గర్ల్స్ కూడా తరలివచ్చారు. యష్ మాస్ అండ్ స్టైలిష్ లుక్స్‌కి లేడీస్ ఏ స్థాయిలో ఫిదా అయ్యారో ఈ రష్ చూస్తే అర్థమవుతుంది. లైవ్ చూస్తున్న నెటిజన్లు సైతం `క్యా రష్ హై!`, `లేడీస్ అండ్ లేడీస్ అంతా యష్ క్రేజ్‌కి ఫిదా అయిపోయారు`` అని కామెంట్లు చేయడం విశేషం.
లైవ్ చాట్‌లో ఎక్కడ చూసినా `రాకీ భాయ్`, `CEO ఆఫ్ ఇండియన్ సినిమా`, `యష్ బాస్` అనే కామెంట్లే కనిపించాయి. గ్రౌండ్‌కు వేలాది మంది అభిమానులు, కాలేజీ విద్యార్థులు తరలిరావడంతో ప్రాంగణం అంతా జనసందోహంతో కిక్కిరిసిపోగా.. అక్కడి జనాన్ని చూసి నెటిజన్లు ``అంతమంది జనం ఉన్నారేంటి!`, ``చివరకు జంతర్ మంతర్ దగ్గర కూడా ఇంతమంది ఉండరు`` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఒకేసారి వేలాది మంది ఫ్యాన్స్ ఒకే ప్రాంతానికి రావడంతో గ్రౌండ్‌లో భారీ తోపులాటలు చోటుచేసుకున్నాయి. ప్రాంగణంలో సరైన సీటింగ్ సౌకర్యం లేకపోవడం.. జనం ఒకరిపై ఒకరు పడటం లైవ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్‌లో అసలు చైర్స్ లేదా?, `ఇంతమందికి సరైన ప్లానింగ్ లేకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు?`, `తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త` అంటూ నిర్వాహకుల వైఫల్యాన్ని వేలెత్తి చూపిస్తూ కామెంట్లు చేశారు.
కేవలం యష్ అభిమానులే కాకుండా ఈ లైవ్ చాట్‌ను ఇతర టాలీవుడ్ ప్రముఖ హీరోల ఫ్యాన్స్ కూడా ఆక్రమించేశారు. అల్లు అర్జున్ (#పుష్ప), ఎన్టీఆర్ (#దేవర), ప్రభాస్, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులు చాట్ బాక్స్‌లో పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగిస్తూ సందడి చేశారు. తమ అభిమాన హీరోల రికార్డులను ప్రస్తావిస్తూ.. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో యూట్యూబ్ లైవ్ చాట్ బాక్స్ కామెంట్లతో నిమిషాల్లో హీటెక్కిపోయింది.
ఏది ఏమైనా..`టాక్సిక్` ఈవెంట్ వేదిక వద్ద జరిగిన తోపులాటలు.. నెటిజన్ల హడావుడి చూస్తుంటే యష్ టాక్సిక్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. ``యష్ ఎంత తోపో ఈ తోపులాటలు చూస్తే తెలుస్తుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడమే కాక... ఈ పాన్-ఇండియా చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్ ఈనెల 26న విడుదలవుతుండగా నేటి నుంచి హైదరాబాద్ ప్రమోషన్స్ జోరుగా ప్రారంభమయ్యాయి. టాక్సిక్ టీమ్ ఇకపై హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో భారీ ప్రచారం నిర్వహించనుంది.