ఇయర్ ఎండ్‌లో శుభం కార్డ్ వేస్తాయా?
ఇవి ఇయర్ ఎండ్‌లో మంచి ఫలితాల్ని అందించి శుభం కార్డ్ వేస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
2025 తెలుగు సినిమాకు బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు. కారణంగా ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అనిపించుకుని కోట్లల్లో నష్టాలని తెచ్చి పెట్టాయి. ఇక ఈ ఏడాది త్రైమాసికంలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన `ఓజీ` విడుదలై ఊరట కలిగించింది. అయితే ఆ తరువాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన `అఖండ 2` గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తే బడ్జెట్‌ని కూడా ఈ సినిమా రాబట్టలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఎండ్‌లో క్రిస్మస్ సందర్భంగా డబ్బింగ్ సినిమాలతో కలిపి ఎనిమిది చిత్రాలు విడుదలవుతున్నాయి. డబ్బింగ్ మూవీస్ `వృషభ`, కిచ్చా సుదీప్ మార్క్ లని పక్కన పెడితే తెలుగు సినిమాలు ఆరు రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఇయర్ ఎండ్‌లో మంచి ఫలితాల్ని అందించి శుభం కార్డ్ వేస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇందులో ముందు వరుసలో ఉన్న మూవీ రోషన్ `ఛాంపియన్`. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి స్వప్న సినిమాస్ నిర్మించింది. తెలంగాణలోని బైరాన్ పల్లి నేపథ్యంలో యుద్ధంతో ముడిపడి సాగే అందమైన ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని హీరోగా సత్తా చాటుకోవాలని రోషన్ ఉవ్విళ్లూరుతున్నాడు.
దీని తరువాత మంచి క్రేజ్ ఆది `శంబాల`పై ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఆది కూడా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటి తరహాలోనే చిన్న సినిమాలు `దండోరా`, ఈషా, పతంగా బజ్‌ని క్రియేట్ చేయగలిగాయి. దీంతో ఇయర్ ఎండింగ్ ఈ సినిమా ఫలితాలతో శుభం కార్డ్ వేస్తాయని అంతా భావిస్తున్నారు.
వీటితో పాటు మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ `వృషభ` కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ ఈ మూవీని రిలీజ్ చేస్తుండటంతో ఇది కూడా హిట్ అనిపించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనితో పాటు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా `మార్క్` కూడా డిసెంబర్ 25నే విడుదలవుతోంది. పవర్‌ఫుల్ పోలీస్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీపై కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఇది కూడా హిట్ అనిపించుకుంటే 2025 పాజిటివ్‌గా ఎండ్ కావడం కాయం.