విజయ్ లెక్కతో.. బన్నీకి సీఎం ట్యాగ్ ఇచ్చిన మామ
ఇక ఇప్పుడు అతని మామగారు చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఒక కామెంట్ మాత్రం పాలిటిక్స్ కనెక్షన్ ను హైలెట్ అయ్యేలా చేసింది.
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడనే మాట అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. కానీ బన్నీ ఆ విషయంలో ఎప్పుడూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు అతని మామగారు చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఒక కామెంట్ మాత్రం పాలిటిక్స్ కనెక్షన్ ను హైలెట్ అయ్యేలా చేసింది. తమిళనాడులో విజయ్‌లా ఇక్కడ అల్లు అర్జున్‌ను కూడా దళపతి అని, కాబోయే సీఎం అని పిలిస్తే ఏమంటారని ఇంటర్వ్యూలో అడగగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటే భవిష్యత్తులో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేముందని చెప్పారు. బన్నీకి ఆ స్థాయి ఉందని కూడా ధీమాగా మాట్లాడారు. అయితే చంద్రశేఖర్ ఇది జస్ట్ తన అభిప్రాయం అని చెప్పిన మాట మాత్రమే. కానీ విజయ్‌ను ఉదాహరణగా తీసుకోవడంతో ఆ కామెంట్ ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది.
విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లాంటి బలమైన పార్టీలు ఉన్నా విజయ్ కింది స్థాయి నుంచి పార్టీని నిర్మించుకున్నారని చెప్పారు. మీటింగ్స్‌కు అనుమతులు రాకపోవడం, మధ్యలో ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. చివరకు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లు సాధించడం చిన్న విషయం కాదని అన్నారు.
అదే ఉదాహరణను బన్నీకి కూడా కలిపి మాట్లాడారు. మంచి నాయకుడు ప్రజల్లోకి వస్తే వాళ్లే ముందుకు వచ్చి మద్దతు ఇస్తారని అన్నారు. డబ్బు, కండబలం మీద మాత్రమే రాజకీయాలు ఎక్కువ కాలం నడవవని కూడా చెప్పారు. అంటే కానీ బన్నీ ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలని ఆయన చెప్పడం లేదు. అవకాశం వస్తే ఆ స్థాయికి వెళ్లగలడనే నమ్మకం మాత్రం ఆయన మాటల్లో కనిపించింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. పుష్ప తర్వాత ఆయన మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు ప్లాన్‌లో ఉన్నాయి. రాజకీయాల గురించి బన్నీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఇలాంటి కామెంట్స్ కు ఫ్యాన్స్ చేసే హడావుడి కాస్త వేరుగా ఉంటుంది. ఇక విజయ్ సీఎం అయిన తర్వాత సినిమా స్టార్ల రాజకీయ ఎంట్రీపై మళ్లీ పోలికలు రావడం సహజమే. ఇప్పుడు అదే పోలిక అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది. బన్నీ ఏం అనుకుంటున్నాడో తెలియదు కానీ, మామగారు మాత్రం అవకాశం వస్తే సీఎం స్థాయి వరకు వెళ్లగలడని ఓపెన్‌గా చెప్పేశారు. ఇక అభిమానులు ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.