8- వారాల OTT రూల్: పరిశ్రమకు షాకిస్తున్న అగ్ర‌ నిర్మాతల వైఖరి!

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో థియేటర్ వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసే వారిలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముందుంటారు.;

Update: 2026-05-06 08:30 GMT

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో థియేటర్ వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసే వారిలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముందుంటారు. థియేటర్లలో సినిమాలు చూసే సంస్కృతిని కాపాడాలని.. సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదని ఆయన గట్టిగా వాదించారు. తాను అన్న మాటపై నిలబడి తన చిత్రం `సితారే జమీన్ పార్` విషయంలో కూడా అదే నిబద్ధతను చాటుకున్నారు. అయితే అమీర్ ఖాన్ తరహాలో ఇతర సినీ పరిశ్రమల్లోని పెద్ద నిర్మాతలు ఓటీటీలను కట్టడి చేసే విషయంలో అంత కఠినంగా లేరన్నది బహిరంగ రహస్యం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలను అడ్డుకుని థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే నిజాయితీ గల ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఓటీటీ సంస్థలు నిర్మాతలకు భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా... ఈ డిజిటల్ డీల్స్ నిర్మాతలను నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి. దీంతో ``రిస్క్ తీసుకోవడం ఎందుకు?`` అనే ఆలోచనలోనే మెజారిటీ నిర్మాతలు ఉంటున్నారు.

మరోవైపు నేటి ప్రేక్షకుల ధోరణి కూడా చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. సినిమా విడుదలైన మొదటి వారంలో మాత్రమే థియేటర్లకు జనం వస్తున్నారు. రెండో వారం తర్వాత కూడా థియేటర్లు నిండాలంటే `బాహుబలి` లేదా `కేజీఎఫ్` వంటి అసాధారణమైన కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రేక్షకులు తమ తీర్పును నిర్ద్వంద్వంగా ప్రకటించేస్తున్నారు. కేవలం ఒక వారం ఆడి ఖాళీ అయిపోయే థియేటర్లను, ఎనిమిది వారాల పాటు అద్దెలు చెల్లించి నడపడం నిర్మాతలకు భారంగా మారుతోంది.

తెలుగు సినీ రంగంలో క్రియాశీలకంగా ఉన్న `యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` సమావేశాల్లో కూడా ఓటీటీల ఆధిపత్యాన్ని ఎదిరించే సాహసం ఏ నిర్మాత చేయలేకపోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఏ సినిమా ఎప్పుడు విడుదలవ్వాలి? ఎప్పుడు ఓటీటీలోకి రావాలి? అనే అంశాలను ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లే శాసిస్తున్నాయి. దీంతో ఎనిమిది వారాల నిబంధన ఇప్పుడు నీరుగారిపోయినట్టే కనిపిస్తోంది. ఫలితంగా సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసే అవకాశం ఉందనే సంకేతాలు అందుతున్నాయి.

ఇక ప్రేక్షకుల వైపు నుంచి ఆలోచిస్తే.... పెరిగిన టికెట్ ధరలు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి. రెండు వారాల్లో ఇంటికే వచ్చే సినిమా కోసం థియేటర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయడం దండగ అనే మనస్తత్వానికి వారు లోనవుతున్నారు. ఇంటి వద్దే పెద్ద ఎల్ఈడీ టీవీల్లో మెరుగైన అనుభవంతో సినిమాను చూసే అవకాశం ఉండటంతో థియేటర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఈ క్రమంలోనే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తెర‌పైకి తెచ్చిన‌ `డైరెక్ట్ టు హోమ్`(డిటిహెచ్) వంటి పద్ధతులపై కూడా పరిశ్రమలో మ‌ళ్లీ చర్చలు మొదలయ్యాయి.

Tags:    

Similar News