వార్ 2 - ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
వార్ 2 బడ్జెట్ పరంగా చూస్తే దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల మధ్యలో ఖర్చు చేసినట్టు టాక్.;
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న భారీ మల్టీ-స్టారర్ మూవీ వార్ 2 మూవీ ఆగస్ట్ 14న రానున్న విషయం తెలిసిందే. అదే సమయంలో రజినీకాంత్ కూలీ కూడా రానుంది. కాబట్టి పోటీ అయితే మామూలుగా ఉండదు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ వంటి స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నా, ప్రచార పరంగా మాత్రం ఆశించినంత మోతాదులో హైప్ కనిపించడంలేదు. హిందీ బాషలో ఈ స్థాయిలో రూపొందిన సినిమాకు ఇప్పటికీ బిజువల్స్, గ్లింప్స్, పాటలతో కూడిన ప్రమోషన్ మొదలుకాలేదు.
ఇప్పటివరకు విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులపై మిక్స్డ్ ఇంప్రెషన్‌నే ఏర్పరిచింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్, విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఉన్నాయని, హై లెవెల్ ఫీలింగ్ రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతలు ట్రైలర్‌ను మళ్లీ రీడిజైన్ చేశారని తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ట్రైలర్‌కి హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్‌ను సితార నాగవంశీ దక్కించుకున్నారన్న వార్త ఇప్పటికే వైరల్ అయింది. దీనికి రూ.80 కోట్ల భారీ డీల్ కుదిరినట్టు ఫిలింనగర్ టాక్. ఇది చూస్తే తెలుగు మార్కెట్‌పై ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. కానీ తెలుగు బాషలోనూ ఈ సినిమా మీద బజ్ అంతగా పెరగకపోవడం ఓ టెన్షన్ పాయింట్. హీరోల అసలు అడ్డాలో బజ్ క్రియేట్ చేయలేకపోతే ఓపెనింగ్స్‌కి ప్రతికూలత రావొచ్చు.
వార్ 2 బడ్జెట్ పరంగా చూస్తే దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల మధ్యలో ఖర్చు చేసినట్టు టాక్. ఈ లెవెల్‌లో బడ్జెట్ పెట్టినప్పుడు సినిమాకు విడుదల ముందు బజ్ వర్కౌట్ కావడం అత్యవసరం. ఇది వరకే స్పై యూనివర్స్‌లో వచ్చిన పటాన్, టైగర్ 3 సినిమాల ప్రమోషన్స్‌తో పోల్చితే వార్ 2 ప్రెస్‌స్ చాలా తక్కువగా కనిపిస్తోంది. కానీ యష్ రాజ్ ఫిలిమ్స్‌కి ఇది ముందస్తు ప్రణాళికే అని అంటున్నారు. చివరికి ట్రైలర్‌తోనే మొత్తం ప్రచారం మొదలవుతుందని చెబుతున్నారు.
ఈ నెల 23 నుంచి 25 మధ్య ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో హృతిక్, ఎన్టీఆర్‌ల మధ్య క్లాష్, కథలో ఎమోషనల్ కనెక్షన్, కియారా అద్వానీ పాత్ర వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారట. అదే సమయంలో ఈ ట్రైలర్‌నే సినిమాకి సరిగ్గా వర్కౌట్ అయ్యే ఎంట్రీ పాయింట్‌గా వాడాలని మేకర్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోవాలంటే ఈ ట్రైలర్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే ట్రైలర్ హిట్టయితేనే సినిమా లెవెల్ మారుతుంది. లేకపోతే బడ్జెట్ స్థాయికి తగ్గ రిటర్న్స్ రావడం కష్టమే. తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉన్నా... కంటెంట్ నుంచి ఆ ఉత్సాహం రాకపోతే కుదరదు. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.