వినాయ‌క్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన హీరో ఎవంటే

ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేశాయి.

Update: 2026-06-13 07:05 GMT

తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్ట‌ర్ వీవీ వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేశాయి. అయితే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేషన్‌కు పరోక్షంగా కారణమైన వ్యక్తి హీరో వడ్డే నవీన్ అని తాజాగా వినాయక్ వెల్లడించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రస్తుతం వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న వీవీ వినాయక్ తన కెరీర్ ప్రారంభ దశకు సంబంధించిన కొన్ని అరుదైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన జీవితాన్ని మలుపుతిప్పిన పరిచయాలు, అవకాశాల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వినాయక్ మాట్లాడుతూ తాను కో- డైరెక్టర్‌గా పనిచేసిన చివరి సినిమా వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కిన మూవీనే అని గుర్తు చేశారు. అదే సమయంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తనకు డైరెక్ట‌ర్ గా అవకాశం ఇచ్చారని వెల్లడించారు. వ‌డ్డే న‌వీన్ మూవీ కోసం విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడే త‌న‌కు డైరెక్ట‌ర్ గా మొద‌టి సినిమా అవ‌కాశ‌మొచ్చింద‌ని తెలిపారు. ఆది సినిమాకు బీజం పడింది మాత్రం వడ్డే నవీన్ సినిమా సమయంలోనే అని ఆయన స్పష్టం చేశారు. ఆ సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సమయంలోనే తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని వినాయక్ తెలిపారు. ఆ పరిచయం తర్వాతే ఆది ప్రాజెక్ట్ ముందుకు వెళ్లిందని, తన దర్శకత్వ ప్రయాణానికి అలాగే ఎన్టీఆర్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వడ్డే నవీన్ సినిమా ఒక ముఖ్యమైన కారణమైందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఎన్టీఆర్- వినాయక్ కాంబో వెనుక వడ్డే నవీన్ పాత్ర ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

ఇక వడ్డే నవీన్ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి కూడా వినాయక్ ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో తమ యూనిట్‌లోని ఓ కాస్ట్యూమర్ ఫ్లైట్ బాత్‌రూమ్ లో సిగరెట్ కాల్చడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నార‌ని, ఆ విష‌యం త‌మ‌కెవ‌రికీ తెలియ‌క‌ముందే, వడ్డే నవీన్ ఎవ‌రికో ఫోన్ చేశార‌ని, వెంట‌నే ఆ కాస్ట్యూమ‌ర్ బయటకు వచ్చాడని వినాయక్ తెలిపారు. ఆ ఘటన చూసిన తర్వాత నవీన్‌కు ఉన్న పరిచయాలు, ఇన్‌ఫ్లుయెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.

అటు ఎన్టీఆర్- వినాయక్ కాంబినేషన్ విషయానికి వస్తే, ఆది సినిమా 2002లో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన సినిమాగా అది గుర్తింపు పొందింది. తర్వాత వచ్చిన సాంబ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆఖ‌రిగా వారి క‌ల‌యిక‌లో 2015లో వచ్చిన అదుర్స్ సినిమా అటు బాక్సాఫీస్ వ‌ద్ద‌నే కాకుండా టెలివిజన్, డిజిటల్ వేదికలపై కూడా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించి ఎన్టీఆర్ కెరీర్‌లో స్పెష‌ల్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా డ్యూయల్ రోల్‌లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో వినాయక్ చేసిన తాజా వ్యాఖ్యలు గత జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చాయి. ఒక సాధారణ షూటింగ్ ట్రిప్‌లో ఏర్పడిన పరిచయం తర్వాత తెలుగు సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన హీరో- డైరెక్ట‌ర్ కాంబినేషన్‌లలో ఒకటి రూపుదిద్దుకోవడం విశేషం. ఇప్పుడు వినాయక్ మాటలతో ఆ ప్రయాణానికి వడ్డే నవీన్ కూడా కీలకమైన లింక్‌గా ఉన్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ప్రమోషన్స్‌లో బయటపడిన ఈ కథనం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.




Tags:    

Similar News