జాన్ అబ్రహం సినిమాల గురించి మాట్లాడకపోతే బెటర్
బాలీవుడ్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత జాన్ అబ్రహాంపై ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మండిపడ్డారు.;
బాలీవుడ్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత జాన్ అబ్రహాంపై ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మండిపడ్డారు. ద కశ్మీర్ ఫైల్స్, ఛావా సినిమాలపై ఇటీవల జాన్ చేసిన విమర్శలకు వివేక్ ఘాటుగా బదులిచ్చారు. జాన్ ఏమీ చరిత్రకారుడు, మేధావి, రచయిత, ఆలోచనపరుడు కాదని, ఇకపై తన సినిమాల గురించి విమర్శలు చేసే సాహసం చేయవద్దని ఒక ఇంటర్వ్యూలో వివేక్ గట్టిగా హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జాన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తానెప్పుడూ అభిమానులను రాజకీయంగా ప్రేరిపించే, ప్రభావం చూపే సినిమాల్లో నటించనని చెప్పారు. తాను ఇప్పటివరకు ఛావా, ద కశ్మీర్ ఫైల్స్ సినిమాలను చూడలేదని, అయితే ప్రజలు ఆ సినిమాలను సూపర్ హిట్ చేయడం తెలుసు అన్నారు. రాజకీయంగా ఉద్రిక్తత వాతావరణాన్ని పెంచే, ప్రజలను ప్రభావితం చేసే సినిమాలంటే తనకు భయమని చెప్పారు. తానెప్పుడూ అలాంటి సినిమాలు చేయలేదని, ఇకపై కూడా చేయబోనని తెలిపారు.
ఆయనేమీ చరిత్రకారుడు కాదు
జాన్ ఏమీ చరిత్రకారుడు కాదని అతడి విమర్శలను తాను పట్టించుకోనని వివేక్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఒక వేళ ఎవరైనా చరిత్రకారులు ఇలాంటి విమర్శలు చేస్తే, అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తా కానీ, జాన్ లాంటి వాళ్లు చేసే విమర్శలను పట్టించుకోనని చెప్పారు. సత్యమేవ జయతే వంటి దేశభక్తి సినిమాలో నటించిన జాన్ ఈ విధంగా మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దేశంలో రాజకీయ పరిస్థితులు ఎప్పడు నిశ్చిలంగా ఉన్నాయని, హిందు-ముస్లిం, కుల పరమైన వివాదాలు ఎప్పుడు లేకుండా ఉన్నాయని వివేక్ ప్రశ్నించారు. మోటర్ బైక్స్ నడపడానికి, కండలు చూపించడానికి, ప్రొటీన్ తినడానికి జాన్ పేరుగాంచాడని, అతడు వాటిపైనే దృష్టి పెట్టడం మంచిదని అన్నారు. జాన్ సినిమాల గురించి మాట్లాడకపోతే బాగుంటుందని సలహా ఇచ్చారు.