ఎన్నో ఏళ్ల ఆశలు.. త్యాగాలు.. నిద్రలేని రాత్రులు.. యువహీరో భావోద్వేగం!
ఈ సందర్భంగా తనకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించి.. తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి - నిశిత నాగిరెడ్డి - దర్శకుడు అభిషేక్ నామాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
భారీ బడ్జెట్ -అత్యున్నత సాంకేతిక విలువలు- భారీ వీఎఫ్ఎక్స్ తో మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన `నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్` చిత్రం ఈరోజు (3జూలై) గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యువ నటుడు విరాట్ కర్ణ నాగాసాధు (రుద్ర) పాత్రలో ప్రధాన కథానాయకుడిగా నటించగా, నభా నటేష్ (పార్వతి), ఐశ్వర్య మీనన్ ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రానికి అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించగా..అభిషేక్ పిక్చర్స్ - ఎన్.ఐ.కె స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హీరో విరాట్ కర్ణ తన సినిమా విడుదల సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ నోట్ సారాంశం ఇలా ఉంది.
రేపు నా జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు అంటూ యువనటుడు విరాట్ కర్ణ తన సుదీర్ఘమైన నోట్ లో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా కేవలం మరో రెగ్యులర్ రిలీజ్ కాదు... ఇది తన ఎన్నో ఏళ్ల ఆశలు.. త్యాగాలు.. నిద్రలేని రాత్రులు.. అవిశ్రాంత శ్రమ .. లెక్కలేనన్ని ప్రార్థనల రూపమని పేర్కొన్నారు. ఒక స్టార్ అవ్వాలనే కోరికతో కాకుండా... ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నమ్మే ఒక మంచి నటుడిగా ఎదగాలనే ఆశయంతో ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని ధారపోశానని.. ప్రతి సీన్ లోనూ తన కష్టం దాగి ఉందని విరాట్ తెలిపారు.
ఈ సందర్భంగా తనకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించి.. తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి - నిశిత నాగిరెడ్డి - దర్శకుడు అభిషేక్ నామాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో పాటు రాత్రింబవళ్లు తోడుగా నిలిచిన డాక్టర్ రాజ్ కుమార్ .. ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి, చిత్ర యూనిట్ సభ్యులకు, తోటి నటీనటులకు, తన సపోర్ట్ టీమ్ (బాలు, వేణు, లక్ష్మణ్), ప్రచార బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
తనకు వెన్నుముకగా నిలిచిన తల్లి, సోదరి, బావ .. కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ తన దివంగత తండ్రిని ఈ క్షణంలో ఎంతో మిస్ అవుతున్నట్లు విరాట్ ఎమోషనల్ అయ్యారు. ఈ శుభతరుణంలో తండ్రి ఇక్కడే ఉండి ఉంటే బాగుండేదని..అయితే ఆయన పైనుంచి తనను చూస్తూ కచ్చితంగా గర్వపడుతుంటారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
చివరగా ప్రేక్షకులే తన బలమని.. తనకు విజయం అందకముందే వారు తనపై నమ్మకం ఉంచి ముందుకు నడిపించారని కొనియాడారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, నిజాయితీతో తీసిన ఈ డివోషనల్ సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. తన నటన ప్రేక్షకులలో ఒక్కరి ముఖంలో చిరునవ్వు తెచ్చినా.. ఒక్కరి కంట తడి పెట్టించినా లేదా ఒక్కరు మనస్ఫూర్తిగా దీవెనలు అందించినా తన శ్రమ అంతా సార్థకమైనట్లేనని.. మిగతాదంతా దేవుడి చేతుల్లో పెడుతున్నానని ..ప్రేమతో ఈ నోట్ రాస్తున్నానని ముగించారు. ఈ లేఖ చదివిన తర్వాత యువనటుడు విరాట్ పెద్ద విజయం సాధించాలని నెటిజనులు తమ బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషబ్ సాహ్ని , అనసూయ భరద్వాజ్ వంటి భారీ తారాగణం భాగమయ్యారు. జునైద్ కుమార్ - అభే అందించిన సంగీతం, సౌందర్ రాజన్ అద్భుతమైన ఛాయాగ్రహణం, ఆర్.సి. ప్రణవ్ కూర్పు ఈ భారీ చిత్రానికి పని చేసారు.