స్నేహితుడు క‌న్యాదానం.. షాకైన ద‌ర్శ‌కురాలు ఫ‌రా

ఈ వీడియోని షేర్ చేసిన అభిమాని .. ఆ క్లిప్ సిమి గ‌రేవాల్ తో ఇంట‌ర్వ్యూ నుంచి తీసుకున్నామ‌ని తెలిపారు.ఈ వీడియోలో షారుఖ్ ఆనందంగా క‌న్యాదాన‌ వేడుకను నిర్వహిస్తూ క‌నిపించాడు.;

Update: 2025-11-10 22:30 GMT

ఒకే ప‌రిశ్ర‌మ‌లో.. ఒకే చోట.. క‌లిసి ప‌ని చేసేప్పుడు పుట్టే స్నేహం.. ఒక‌రికోసం ఒక‌రుగా.. క‌ష్ట సుఖాల్లో ఒక‌రికొక‌రు స‌హ‌కారిగా .. ఒక‌రి ఎదుగుద‌ల‌లో భాగస్వామిగా.. ఇలా సాగే స్నేహం కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. అలాంటి అరుదైన స్నేహం బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్, కొర‌యోగ్రాఫ‌ర్ కం డైర‌క్ట‌ర్ ఫ‌రా ఖాన్ మ‌ధ్య ఉంది. ద‌శాబ్ధాల స్నేహానుబంధం ఆ ఇద్ద‌రిదీ. ఆ ఇద్ద‌రి కెరీర్ ఎదుగుద‌ల స‌మాంత‌రంగా సాగింది.

ఫ‌రా ఒక కొరియోగ్రాఫ‌ర్ గా షారూఖ్ తో క‌లిసి సినిమాలు చేసారు. ఒక డైరెక్ట‌ర్ హోదాలోను అత‌డితో క‌లిసి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌ని చేసారు. ఆ అనుబంధం మ‌రింత ధృఢంగా మారింది. అయితే ఈ స్నేహానికి సింబాలిక్ గా ఒక ఘ‌ట‌న గురించి ఈ రోజు గుర్తు చేసుకోవాలి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2004లో ఫరాఖాన్ ఎడిటర్ కం ఫిలింమేక‌ర్ శిరీష్ కుందర్‌ను వివాహం చేసుకున్నప్పుడు షారుఖ్ ఖాన్ తన కన్యాదానం (కూతురిని ఇవ్వడం) ఇచ్చిన దృశ్యం ఇప్పుడు మ‌రోసారి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

ఇన్ స్టాలో దీనిని ఒక అభిమాని షేర్ చేసి స్నేహం అంటే ఇదేరా! అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఫరా ఖాన్, షారూఖ్ స్నేహం ఎంతో గొప్ప‌ది అని చాలా మంది ప్ర‌శంసించారు. ఆ వీడియోలో షారూఖ్ క‌న్యాదాన‌మిచ్చి ఫ‌రా బుగ్గ‌పై లాల‌న‌గా ముద్దాడాడు. ఎంతో ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్న ఈ ఇన్ స్టా వీడియో వీక్షించిన ఫ‌రా ఆ క్ష‌ణాన్ని మ‌రువ‌లేక‌పోయారు. ఆ వీడియో చూసి ఆనందంతో కూడుకున్న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు. ఓ మై గాడ్, మీరు దీన్ని ఎక్కడ కనుగొన్నారు?? అని ఫ‌రా ప్ర‌శ్నించారు.

ఈ వీడియోని షేర్ చేసిన అభిమాని .. ఆ క్లిప్ సిమి గ‌రేవాల్ తో ఇంట‌ర్వ్యూ నుంచి తీసుకున్నామ‌ని తెలిపారు.ఈ వీడియోలో షారుఖ్ ఆనందంగా క‌న్యాదాన‌ వేడుకను నిర్వహిస్తూ క‌నిపించాడు. అక్క‌డ‌ ఒక పండిట్ ఆమెను మార్గనిర్దేశం చేస్తున్నారు. తరువాత అతడు ఫరాను కౌగిలించుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియోలో ఫరా పెళ్లి వేడుక‌ నుండి కొన్ని అరుదైన ఘ‌ట్టాలు క‌నిపించాయి.

కింగ్‌ ఖాన్‌తో ఫరా దశాబ్దాల స్నేహం ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. 1990ల నాటి ఈ స్నేహబంధం ఎప్ప‌టికీ వీడ‌నిది. కభీ హాన్ కభీ నా, దీవానా రోజుల నుంచి మొద‌లైంది. మై హూ నా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలలో షారూఖ్ ని ఫ‌రా డైరెక్ట్ చేసారు. ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించాయి. మై హూ నా సెట్స్‌లో కలిసిన తర్వాత ఫరా 2004లో శిరీష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకు జార్, కుమార్తెలు దివా, అన్య 2008లో జన్మించారు.


Tags:    

Similar News