సచిన్ టెండూల్కర్ స్నేహితుడి జీవితంపై వెబ్‌సిరీస్!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడిపై వెబ్ సిరీస్ అనగానే.. ఆయనకు ఉన్న చాలా మంది స్నేహితులలో ఎవరై ఉంటారు? అనే సందేహం కలగొచ్చు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడిపై వెబ్ సిరీస్ అనగానే.. ఆయనకు ఉన్న చాలా మంది స్నేహితులలో ఎవరై ఉంటారు? అనే సందేహం కలగొచ్చు. సచిన్ కి ధీటుగా కెరీర్ ఆరంభించి రకరకాల కారణాలతో అనూహ్యంగా క్రికెట్ నుంచి సంపూర్ణంగా నిష్కృమించిన ది గ్రేట్ వినోద్ కాంబ్లీ గురించి ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆయన జీవితంపై ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
భారత మాజీ సంచలనాత్మక క్రికెటర్ వినోద్ కాంబ్లీ సంచలనాత్మక జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. వి. శాంతారామ్ బయోపిక్ వాయిదా పడటంతో దర్శకుడు అభిజీత్ దేశ్‌పాండే తన దృష్టిని ఈ ప్రాజెక్ట్‌పైకి మళ్లించారు. అయితే ఈ కథను ఒక సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గల ప్రధాన కారణాలను దర్శకుడు ఇటీవల వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 .. `సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్` నిర్మించిన రవి భగచంద్కా ప్రొడక్షన్ ఈ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దర్శకుడు అభిజీత్ దేశ్‌పాండే 2019లోనే కాంబ్లీ కథను రాయడం ప్రారంభించారు. మొదట్లో దీనిని ఒక మరాఠీ సినిమాగా నిర్మించాలని భావించినా కాంబ్లీ జీవితాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాంబ్లీ జీవితంలో అనేక మలుపులు.. సుదీర్ఘమైన సంఘటనలు .. తీవ్రమైన డ్రామా ఉన్నాయి. కేవలం రెండున్నర లేదా మూడు గంటల సినిమాలో అతడి జీవితంలోని ప్రయాణాన్ని.. ఎదుర్కొన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో చూపించడం అసాధ్యమని గ్రహించి.. సిరీస్ ఫార్మాట్‌ను ఎంచుకున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం ఆట చుట్టూ తిరిగే స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదని... ఒక మనిషి జీవితంలో ఎదురైన అపూర్వ విజయాలు... ఆ తర్వాతి ఒడిదొడుకుల సమగ్ర రూపాన్ని ఆవిష్కరించే మానవీయ కోణమని దర్శకుడు వెల్లడించారు. భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడైన యంగ్ బ్యాట్స్‌మెన్‌గా కాంబ్లీ అడుగుపెట్టిన సమయం నుండి.. అతడికి ఎదురైన వ్యక్తిగత... వృత్తిపరమైన సవాళ్లు అతడి కెరీర్‌ను ఎలా మార్చేశాయో ఇందులో నిశితంగా చూపించనున్నారు. అయితే మీడియా హెడ్ లైన్స్ కి అతీతంగా కాంబ్లీ జీవితంలో వెలుగుచూడని చాలా ఆసక్తికర విషయాలను ఈ సిరీస్ ద్వారా వెలికితీయనున్నారు.
ఈ సిరీస్‌లో కాంబ్లీ పాత్ర కోసం ప్రధాన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కాంబ్లీ పోలికలతో ఉండే ఒక కొత్త నటుడిని (ఫ్రెష్ ఫేస్) కథానాయకుడిగా పరిచయం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కాంబ్లీ వ్యక్తిత్వాన్ని.. ఆయన జీవిత ఘట్టాలను ఎంతో వాస్తవికంగా.. పద్ధతిగా తెరకెక్కించడమే తమ లక్ష్యమని మేకర్స్ చెబుతున్నారు. హిందీ భాషలో రానున్న ఈ వెబ్ సిరీస్... కాంబ్లీ కథను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ మరింత చేరువ చేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను నవంబర్ 2026 నుండి ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 3 నుండి 4 నెలల వ్యవధిలో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ `కాంబ్లీ` సిరీస్ పనులు పూర్తయిన వెంటనే... దర్శకుడు అభిజీత్ దేశ్‌పాండే వి. శాంతారామ్ బయోపిక్ షూటింగ్‌ను పట్టాలెక్కిస్తారు. కాంబ్లీ జీవితంలోని తీపి-చేదు జ్ఞాపకాల సమ్మేళనంగా రానున్న ఈ సిరీస్ క్రీడాభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.