మలయాళ వెర్షన్‌తో డిఫరెన్స్‌ను బయటపెట్టిన శ్రియ!
కథనం వినోదాత్మకంగా ఉండటమే కాకుండా అద్భుతంగా రాసారు. దర్శకుడు అభిషేక్ పాఠక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం` అన్నారు.
అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ `దృశ్యం 3: ది కన్‌క్లూజన్` బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్న నేపథ్యంలో నటి శ్రియా శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ మూల చిత్రంతో అజయ్ దేవ్‌గణ్ హిందీ వెర్షన్‌ను నేరుగా పోల్చడాన్ని అమ్మడు తోసిపుచ్చారు. హిందీ వెర్షన్ స్వతం త్రమైన కథాంశంతో.. విభిన్న కోణంలో సాగుతుందని కాబట్టి ఈ రెండింటినీ పోల్చడం సరైంది కాదని శ్రియా పేర్కొన్నారు.`ప్రజలు ఈ చిత్రాన్ని ఎంతగానో ఆస్వాదించడం చాలా సంతోషాన్ని, కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తోంది.
కథనం వినోదాత్మకంగా ఉండటమే కాకుండా అద్భుతంగా రాసారు. దర్శకుడు అభిషేక్ పాఠక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం` అన్నారు. మొదటి రెండు భాగాల ఆధారంగానే సాగినా? మూడో భాగంలో హిందీ మేకర్స్ సరికొత్త కథా విభాగాన్ని ఎంచుకున్నారని వెల్లడించారు. మలయాళంలో వచ్చిన `దృశ్యం 3` కథనాన్ని నేరుగా రీమేక్ చేయకుండా హిందీ టీమ్ తమకంటూ ప్రత్యేకమైన కథనంతో ముందుకు సాగింది. అభిషేక్ పాఠక్, రచయితలు ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వేజ్ షేక్‌లతో కలిసి రెండేళ్లపాటు శ్రమించి విభిన్న కథనాన్ని సిద్ధం చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి.
జార్జ్‌కుట్టి/విజయ్ సల్గాంకర్ ప్రయాణానికి ముగింపునిచ్చే విధానంలో రెండు వెర్షన్లు వేర్వేరు దారులను ఎంచుకోవడం ప్రేక్షకులు .. విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మలయాళ వర్షన్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా హిందీ `దృశ్యం 3` ముగింపును ప్రశంసించడం విశేషం. `నేను `దృశ్యం: ది కన్‌క్లూజన్` చూశాను. ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించిన ఈ ప్రయాణానికి వారు అందించిన సరైన ముగింపు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు అభిషేక్ పాఠక్, నిర్మాత కుమార్ మంగత్ పాఠక్, అజయ్ దేవ్‌గణ్ బృందానికి నా అభినందనలు` అని మోహన్‌లాల్ తెలిపారు.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే `దృశ్యం 3: ది కన్‌క్లూజన్` ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. భారతదేశంలో 323.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. డొమెస్టిక్ గ్రాస్ 387.80 కోట్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్ల నుండి 114 కోట్ల గ్రాస్‌తో కలిపి మొత్తం రూ. 501.80 కోట్ల మార్కును అందుకుంది.
విజయ్ సల్గాంకర్గా అజయ్ దేవ్‌గణ్, మీరా దేశ్‌ముఖ్‌గా టబు, నందినిగా శ్రియా శరణ్ మళ్లీ తమ నటనతో అలరించగా, ఎస్పీ రాజ్వీర్ సింగ్ తోమర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ అదనపు ఆకర్షణగా నిలిచారు. గ్రిప్పింగ్ కథనం, సరికొత్త ట్విస్టులు , నటీనటుల ప్రతిభే సినిమాను ప్రపంచవ్యాప్తంగా విజయ తీరాలకు చేర్చిందని యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.