RC17: డెన్ ఓపెనింగ్ సరే.. ఆ టెన్షన్ ఈసారైనా తప్పుతుందా సుక్కూ!

పుష్ప 2 రిలీజ్ ముందు సుకుమార్ పడ్డ హడావుడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆగస్టులో రావాల్సిన బొమ్మ కాస్తా డిసెంబర్ కు షిఫ్ట్ అయింది.

Update: 2026-10-14 15:59 GMT

పుష్ప 2 రిలీజ్ ముందు సుకుమార్ పడ్డ హడావుడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆగస్టులో రావాల్సిన బొమ్మ కాస్తా డిసెంబర్ కు షిఫ్ట్ అయింది. రిలీజ్ రోజు దగ్గరపడినా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెరకు పని చెబుతూనే ఉన్నారు. అయితే రామ్ చరణ్ తో చేయబోయే RC17 విషయంలో మాత్రం సుక్కు టీమ్ చాలా ముందుగానే అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి, రైటింగ్ టీమ్ తో కలిసి 'మాస్టర్‌మైండ్ డెన్ రెడీ' అంటూ ఫొటోలు వదిలారు.




నిజానికి సుకుమార్ సినిమాలకు లేట్ అవ్వడం కొత్తేమీ కాదు. ఆఖరి నిమిషం వరకు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగడంతో రిలీజ్ డేట్ మీద ప్రతీ సినిమాకు అనుమానాలు వచ్చాయి. ఇక పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రిలీజ్ ముందు నెలకొన్న ఆ హడావుడి మాత్రం గుర్తుండిపోయింది. మళ్లీ అలాంటి ఆఖరి నిమిషం గందరగోళం రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి ముందుగానే పనులన్నీ సర్దుకుంటున్నారా అనే టాక్ మొదలైంది.




ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, RC17 రెగ్యులర్ షూట్ ను డిసెంబర్ లో స్టార్ట్ చేసి 2027 చివరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అంటే దాదాపు ఏడాది పాటు చిత్రీకరణకు సమయం కేటాయించనున్నారు. అయితే మేకర్స్ వైపు నుంచి ఎలాంటి అధికారిక డెడ్ లైన్ బయటకు రాలేదు. ప్రస్తుతం కొత్త ఆఫీస్ ప్రారంభం మాత్రమే జరిగింది. సెట్స్ పైకి వెళ్లాక ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. భారీ ప్రాజెక్ట్ కావడంతో లొకేషన్లు, ఇతర నటీనటుల డేట్లు ముందే పక్కాగా లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందులో హీరో రామ్ చరణ్ కాల్షీట్లు చాలా కీలకం. పెద్ది తర్వాత చేయబోయే ఈ మూవీ కోసం చరణ్ సరికొత్త లుక్ లోకి మారేందుకు రెడీ అవుతున్నారు. సుకుమార్ స్క్రిప్ట్ లాక్ చేసినా, సెట్స్ మీదకు వెళ్లాక సీన్లను మెరుగుపరచడం కోసం రీ వర్క్ చేసే అలవాటు ఆయనకు ఉంది. అలాంటి వర్కింగ్ స్టైల్ ఉన్నప్పుడు అనుకున్న టైమ్ కు సినిమాను చుట్టేయడం అంత ఈజీ కాదు.

'రంగస్థలం' తర్వాత మళ్లీ కలుస్తున్న ఈ కాంబినేషన్‌లో చరణ్ పాత్ర ఎలా ఉంటుందనే విషయం కూడా ఇంకా బయటకు రాలేదు. 'పుష్ప 2' సమయంలో చివరి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగిన నేపథ్యంలో, RC17 విషయంలో షూటింగ్ షెడ్యూల్స్‌తో పాటు ఎడిటింగ్, ఇతర పనులకు ముందుగానే సమయం కేటాయిస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్‌కు తగినంత గ్యాప్ లేకపోతే మళ్లీ రిలీజ్ దగ్గర హడావుడి తప్పదు.

ప్రస్తుతానికి కొత్త ఆఫీస్ లో దర్శకుడు, రైటర్లు, నిర్మాతలు కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే అసలైన ముహూర్తం కార్యక్రమం ఉండబోతోందని సుకుమార్ రైటింగ్స్ స్పష్టం చేసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు ఫిక్స్ అవుతారు అనేది ఈసారి అసలైన సస్పెన్స్. ఇప్పటివరకు సంగీత దర్శకుడిని మార్చని సుకుమార్ ఈసారి మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. అనిరుధ్ రావచ్చని అంటున్నారు. చూడాలి మరి ఎవరిని ఫైనల్ చేస్తారో.



Tags:    

Similar News