తెలుగోళ్ళు తిట్టేసరికి తమిళ టైటిల్ మారింది

టాలీవుడ్‌లో తమిళ్ సినిమాలను డబ్‌ చేసి విడుదల చేయడం కొత్తేమీ కాదు. అయితే టైటిల్స్ విషయంలో మాత్రం అప్పుడప్పుడూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.;

Update: 2025-09-08 03:36 GMT

టాలీవుడ్‌లో తమిళ్ సినిమాలను డబ్‌ చేసి విడుదల చేయడం కొత్తేమీ కాదు. అయితే టైటిల్స్ విషయంలో మాత్రం అప్పుడప్పుడూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తమిళంలో సాధారణంగా వినిపించే కొన్ని పేర్లు, తెలుగులోకి వచ్చేసరికి వింత అర్థాలు ఇస్తాయి. ఈ కారణంగా టైటిల్‌లపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌లు నడుస్తాయి. ఇదే పరిస్థితి విజయ్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేసిన తాజా ప్రాజెక్ట్ విషయంలో కనిపించింది.

తమిళ్‌లో సింపుల్‌గా ఉన్న టైటిల్‌, తెలుగులోకి వచ్చేసరికి అసభ్యార్థం కలిగించేలా మారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇంత పెద్ద పొరపాటు ఎలా చేసారు? టైటిల్ రిలీజ్ చేసే ముందు ఒక్కసారైనా అర్థం చెక్ చేయరా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేశారు. దీంతో సినిమా టీమ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.

చివరికి మేకర్స్ వెంటనే రియాక్ట్ అవుతూ టైటిల్ మార్చేసారు. ముందు పెట్టిన టైటిల్ ను తీసేశారు. ఇప్పుడు ‘బూకీ’గా మార్చి అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన భారీ నెగటివ్ రెస్పాన్సే. ఇక సెప్టెంబర్ 8న ఈ సినిమా గ్రాండ్ పూజా కార్యక్రమం జరగనుందని కూడా వెల్లడించారు. అంటే, టైటిల్ మార్పుతో పాటు పాజిటివ్ నోట్ తో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

ఇకపోతే, తమిళ్ నుంచి నేరుగా టైటిల్ తీసుకోవడమే తప్పు కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఆ టైటిల్ స్థానిక భాషలో ఏ అర్థం ఇస్తుందో కనీసం పరిశీలించడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే సినిమాకు అనవసరమైన నెగటివ్ హైప్ వస్తుందని, ఇది బిజినెస్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడు సినిమాతో పెద్ద మార్కెట్ ఏర్పడింది. అలాంటి సమయంలో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు ఇలాంటి వివాదం రావడం అసహజంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. కంటెంట్ బాగుంటే వసూళ్లకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ ఇలాంటి టైటిల్ సమస్యలు పునరావృతం అయితే డబ్ సినిమాలపై ఆడియన్స్ నమ్మకం దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News