జన నాయగన్ ఇష్యూ.. విజయ్ మరో మూవీ చేయనున్నారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వరుస పరిణామాలతో ఆయన పేరు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది.;
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వరుస పరిణామాలతో ఆయన పేరు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే విజయ్ చివరి చిత్రం జన నాయగన్ విడుదలలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో.. ఆయన కొత్త ప్రాజెక్ట్ పై ఊహాగానాలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ బ్యానర్ లో విజయ్ మరో సినిమా చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
నిజానికి జన నాయగన్ సినిమాను హెచ్. వినోథ్ దర్శకత్వంలో కేవీఎన్ బ్యానర్ రూపొందిస్తోంది. కానీ ఆ మూవీ విడుదలకు ముందు నుంచే అనేక అడ్డంకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సెన్సార్ సమస్యలు, ఇటీవల జరిగిన పైరసీ లీకులు చిత్ర యూనిట్ కు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన వీడియోస్ ఆన్లైన్ లో లీక్ కావడం పెద్ద సంచలనంగా మారింది.
దీంతో నిర్మాతలు, దర్శకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తదుపరి ప్రాజెక్ట్ అంటూ కొత్త చర్చ మొదలైంది. ఆ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అందులో నిజమెంతో తెలియకపోయినా.. విజయ్- వెట్రిమారన్ కాంబినేషన్ కుదిరితే అది భారీ సంచలనం సృష్టిస్తుందని సినీ ప్రియులు భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే విజయ్ సన్నిహిత వర్గాలు స్పందించినట్లు తెలుస్తోంది. జన నాయగన్ లీక్ కారణంగా విజయ్ మరో సినిమా చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అన్ని కథనాలు నిరాధారమైనవేనని క్లారిటీ ఇచ్చినట్లు వినికిడి. అదే సమయంలో జన నాయగన్ తో విజయ్ ఇప్పటికే తన సినీ కెరీర్ కు ముగింపు పలకనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
జన నాయగన్ నే తన చివరి చిత్రమని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ప్రవేశించాలని ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన 30 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానుల మద్దతుపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కానీ తాజా ఊహాగానాలు మరోసారి ఆయన రీఎంట్రీపై చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.
ఒకవేళ నిజంగానే విజయ్ – వెట్రిమారన్ కాంబినేషన్ కుదిరితే అది ఆయన కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏది కూడా వెలువడలేదు. మొత్తంగా చూస్తే.. జన నాయగన్ విడుదల పరిస్థితి స్పష్టత వచ్చే వరకు ఆ వార్తలపై క్లారిటీ రానట్టే కనిపిస్తోంది. అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరో నుంచి మరో సినిమా వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.