మాలీవుడ్ బ్యూటీకి సేతుపతి బూస్టింగ్!
సీనియర్లను గౌరవించడం...జూనియర్లకు సలహాలివ్వడం అన్నది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తొలి నుంచి ఉన్న అలవాటు.
సీనియర్లను గౌరవించడం...జూనియర్లకు సలహాలివ్వడం అన్నది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తొలి నుంచి ఉన్న అలవాటు. తాను చెప్పాలనుకున్నది సూటిగానే నటులకు..టెక్నీషయన్లకు చెబుతుంటారు. కింద వ్యక్తలు ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ముందుటారు. తాజాగా జరిగిన 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర కథానాయిక సంయుక్త మీనన్‌పై సేతుపతి ప్రశంసలు కురిపించారు. తాము కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత తరం నటీమణులలో సంయుక్త అత్యంత ప్రతిభావంతురాలైన నటి అని కొనియాడారు.
సంయుక్త కేవలం స్క్రిప్ట్‌ను చదివి నటించే నటి కాదు. కథలోని లోతును, పాత్ర ప్రాధాన్యతను పూర్తిగా అర్థం చేసుకునే విలక్షణమైన నటి అని పేర్కొన్నారు. తాజా చిత్రంలో ఆమె నటన , పాత్రను ఎంచుకున్న విధానం ఆమెలోని పరిణతికి అద్దం పడుతుతుందన్నారు. పరిశ్రమలో ఒక నటి దీర్ఘకాలం నిలబడాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదని.. కథపై ఉండే అవగాహన కూడా ముఖ్యమని.. అది సంయుక్తలో పుష్కలంగా ఉందని సేతుపతి ప్రశంసించారు. 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' చిత్రం వినూత్నమైన కథాంశంతో.. విభిన్నమైన సామాజిక నేపథ్యంలో తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఈ చిత్రంలో సంయుక్త పోషించిన పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడు కున్నదని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంయుక్త వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కొత్త చిత్రం లో డీగ్లామరైజ్డ్ .. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం సంయుక్త కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
ఇటీవలి కాలంలో కంటెంట్ నడిపించే చిన్న, మధ్య తరహా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' కూడా అదే కోవలోకి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో అందించిన మద్దతు.. సంయుక్త నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా..పూరి జగన్నాధ్ మేకింగ్ హైలైట్ గా నిలవనున్నాయి. త్వరలోనే చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విజయం పూరి కి అత్యంత కీలకమైంది.ఇ ప్పటికే వరుస ప్లాప్ ల్లో ఉన్న పూరి ఈ విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి ఉంది.