దళపతి విజయ్ యుద్ధం ఇప్పుడే మొదలైందా?
దీనిపై ఇప్పుడు సీబీఐ విచారణ జరుగుతోంది. ఇంకా ఈ కేసు ఎటూ తేలలేదు. విజయ్ మాత్రం వరుసగా పిలిచిన ప్రతి సారి హాజరవుతూ వస్తున్నాడు.;
సమాజంలో పేరు, పాపులారిటీ, పలుకుబడి ఉన్నవాళ్లు, ముఖ్యంగా సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఉండే హంగామా..అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న పార్టీలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇది తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత, తెలుగు దేశం పార్టీని స్థాపించి స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న సమయంలోనూ.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి చిరంజీవి ఎంట్రీ ఇవ్వాలనుకున్న టైమ్‌లోనూ..పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన టైమ్‌లోనే ఇదే జరిగింది.
వీరంతా రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న సమయంలో వీళ్లపై బురద చల్లని రాజకీయ పార్టీ లేదు. రాజకీయ నాయకుడు లేడు. కారణం భయం. ఎక్కడ తమని మించి పోయి ఏళ్లుగా గూడుకట్టుకున్న పార్టీలని పాతరేస్తారేమోననే భయం. తమిళనాట స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వేళ కూడా ఇదే తంతు రిపీట్ అవుతోందనే చర్చ జరుగుతోంది. దీనికి విజయ్ పార్టీ ప్రచార సభల్లో జరుగుతున్న సంఘటనలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. విజయ్ టీవీకే పార్టీని ప్రకటించి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం తెలిసిందే.
పార్టీ ప్రకటన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఆ తరువాత కరూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఘోరం జరిగింది. కెపాసిటీకి మించి అభిమానులు భారీ స్థాయిలో పాల్గొనడంతో అక్కడ సెక్యూరిటీ చేతులెత్తేసింది. ఫలితం 40 మందికి పైగా నిండు ప్రాణాలు బలయ్యాయి. అబిమానులతో పాటు దారిలో వెళుతూ వెళుతూ విజయ్ కనిపించగానే చూడాలనే ఉత్సాహంతో అక్కడికి చేరిన వారు కూడా మృత్యువాతపడటం అందరిని కలిచివేసింది.
దీనిపై ఇప్పుడు సీబీఐ విచారణ జరుగుతోంది. ఇంకా ఈ కేసు ఎటూ తేలలేదు. విజయ్ మాత్రం వరుసగా పిలిచిన ప్రతి సారి హాజరవుతూ వస్తున్నాడు. పార్టీ జెండాపై వివాదం. దీనిపై కొన్ని రోజులు వివాదం నడిచింది. ఇక విజయ్ నటించిన `జన నాయగన్` చుట్టూ సెన్సార్ వివాదం తలెత్తడం..సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నా గత మూడు నెలలుగా రిలీజ్‌కు నోచుకోకపోవడం. దీని వెనుక తనని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కోణం ఉందని విజయ్ బాహాటంగానే స్టెట్మెంట్ ఇవ్వడం సంచలనం సృష్టించింది.
ఇవన్నీ ఒకెత్తయితే భార్య సంగీత తన నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. అంతే కాకుండా విడాకులు మంజూరు అయ్యేంత వరకు తనని విజయ్ ఇంటిలోనే ఉండేలా చూడాలని సంగీత మరో పిటీషన్ వేయడం. అదే సమయంలో త్రిషతో కలిసి విజయ్ చెన్నైలో ఓ పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొనడంతో వివాదం మరో మలుపు తిరిగింది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్, త్రిషల బంధంపై సంచలన వ్యాఖ్యలు చేయడం, త్రిష ఇంటిని వీడి విజయ్ బయటికి రావాలని సంచలన ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన టీవీకే పార్టీ అత్యధిక సీట్లని గెలిస్తేనే విజయ్‌కి ప్రశాంతత లేదంటే గెలిచిన పార్టీ విజయ్‌ని టార్గెట్ చేయడం ఖాయమని,విజయ్ అసలు యుద్దం ముందుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి విజయ్ కూడా దీనికి రెడీగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు.