రీజనల్ మార్కెట్‌నే టార్గెట్ చేసిన నయా దర్శకులు!
వందల కోట్ల బడ్జెట్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, దేశవ్యాప్త మార్కెట్ అంటూ అగ్ర దర్శకుల నుంచి వర్ధమాన దర్శకుల వరకు అంతా ఇండస్ట్రీ సరిహద్దులు దాటడానికి ఉత్సాహం చూపిస్తున్నారు
ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా జపమే వినిపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, దేశవ్యాప్త మార్కెట్ అంటూ అగ్ర దర్శకుల నుంచి వర్ధమాన దర్శకుల వరకు అంతా ఇండస్ట్రీ సరిహద్దులు దాటడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ పరుగు పందెంలో కొందరు స్టార్ - యంగ్ డైరెక్టర్లు మాత్రం పూర్తి భిన్నమైన రూట్ ఎంచుకుంటున్నారు. అందరిలా పాన్ ఇండియా మోజులో పడకుండా పట్టున్న రీజనల్ మార్కెట్ పైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రిస్కులతో కూడిన గ్లోబల్ ప్రాజెక్టుల కంటే? స్థానిక ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీసి సక్సెస్ సాధించడమే బెటర్ అని బలంగా నమ్ముతున్నారు.
ఈ పంథాలో ప్రయాణిస్తున్న వారిలో అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వెంకీ అట్లూరి వంటి దర్శకులు ముందు వరుసలో కనిపిస్తున్నారు. వీరంతా తమ ప్రాంతీయ మార్కెట్ పరిధిని, ఇక్కడి ప్రేక్షకుల పల్స్‌ను పక్కాగా అర్థం చేసుకున్న మేకర్స్. బాలీవుడ్ లేదా ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించడం కోసం అనవసరమైన హంగులకు పోకుండా అచ్చమైన తెలుగు కమర్షియల్ ఎలిమెంట్స్‌తోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భారీ బడ్జెట్లతో హిందీ మార్కెట్లలో పోటీ పడటం కంటే కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని లోకల్ బాక్సాఫీస్ వద్ద పక్కా హిట్లు కొట్టడం ద్వారా క్రేజ్‌ను స్థిరంగా కాపాడుకుంటున్నారు.
ఈ దర్శకులు రీజనల్ మార్కెట్‌కు పరిమితమవ్వడం వెనుక పక్కా సేఫ్ గేమ్ స్ట్రాటజీ ఉంది. పాన్ ఇండియా సినిమా అంటే కనీసం రెండు మూడు ఏళ్ల సమయం కేటాయించాలి. వందల కోట్ల బడ్జెట్ పెట్టాలి. పైగా అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియని రిస్క్ ఉంటుంది. అదే ప్రాంతీయ సినిమా అయితే ఏడాదిలోపే షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయోచ్చు. దీనివల్ల నిర్మాతలకు సేఫ్ బెట్ అవుతుంది. ఇటు దర్శకులకు కూడా లాంగ్ గ్యాప్ రాకుండా బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది. రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉండటం వల్లే నయా దర్శకులు లోకల్ మార్కెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే ఈ సేఫ్ గేమ్ కారణంగా కొత్త ప్రయోగాలు చేయడానికి.. కెరీర్ పరంగా పెద్ద సాహసాలు చేయడానికి వెనుకాడుతున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, మాస్ మసాలా యాక్షన్ డ్రామాలు వంటి పాత ఫార్ములాలనే నమ్ముకోవడం వల్ల వీరి కథల్లో వైవిధ్యం లోపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ థియేటర్లకు వచ్చే సామాన్య ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడంలో ఈ దర్శకులు ఎప్పుడూ విఫలం కాలేదు. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగ సీజన్లలో రీజనల్ మార్కెట్ బాక్సాఫీస్ వసూళ్లకు వీరే ప్రధాన పిల్లర్లుగా నిలుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందరూ ఒకే దారిలో వెళ్తున్నప్పుడు తాము మాత్రం నమ్ముకున్న దారిలోనే ప్రయాణించి సక్సెస్ సాధించడం ఈ దర్శకుల ప్రత్యేకత. పాన్ ఇండియా రేసులో పడి కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడం కంటే ప్రాంతీయ మార్కెట్‌లో తిరుగులేని పట్టు సాధించడమే సురక్షితమైన మార్గమని నిరూపిస్తున్నారు. భారీతనం కంటే వినోదానికే ప్రేక్షకులు మొదటి ప్రాధాన్యత ఇస్తారని నమ్మే మేకర్స్ రాబోయే రోజుల్లో రీజనల్ మార్కెట్ పరిధిలోనే మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ లోకల్ స్ట్రాటజీ టాలీవుడ్ అంతర్గత మార్కెట్‌ను ఎంతవరకు బలోపేతం చేస్తుందో చూడాలి.