'జన నాయకుడు'లో 'భగవంత్ కేసరి' స్టోరీ అంత వరకేనా?
ఈ నేపథ్యంలో శనివారం విడుదలై `జన నాయకుడు` ట్రైలర్ స్పష్టతనిచ్చింది. అయితే కొన్ని విషయాలని మాత్రం ఇంకా హైడ్‌లోనే పెట్టింది.;
దళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ `భగవంత్ కేసరి` రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు భిన్నంగా స్పందించాడు. ఇది రీమేక్ కాదని, ఇది పక్కాగా దళపతి విజయ్ సినిమా అని చెప్పుకొచ్చాడు. ఇక `భగవంత్ కేసరి` డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దాదాపు ఇదే విధంగా స్పందిచాడు. అయితే ఈ సినిమాలో తనని ఎంత వరకు ఉపయోగించుకున్నారో రేపు సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదంటూ పెద్ద హింట్ ఇచ్చాడు.
పక్కా రీమేక్ అనే క్లారిటీ ...
ఈ నేపథ్యంలో శనివారం విడుదలై `జన నాయకుడు` ట్రైలర్ స్పష్టతనిచ్చింది. అయితే కొన్ని విషయాలని మాత్రం ఇంకా హైడ్‌లోనే పెట్టింది. ఓవరాల్‌గా ట్రైలర్‌తో ఇది బాలకృష్ణ- అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు సూపర్‌హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి`కి రీమేకే అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే అది పూర్తిగా మాత్రం కాదని, దర్శకుడు హెచ్. వినోద్ చాలా వరకు మార్పులు చేసినట్టుగా ట్రైలర్‌తో తెలుస్తోంది. తెలుగులో బాలకృష్ణ పోషించిన పాత్రని విజయ్, శ్రీలీల క్యారెక్టర్‌ని మమితా బైజు, కాజల్ పాత్రలో పూజా హెగ్డేలని తీసుకున్నాడు.
అర్జున్ రాంపాల్ పోషించిన రాహుల్ సాంగ్వీ క్యారెక్టర్‌ని `యానిమల్` స్టార్ బాబి డియోల్ చేశాడు. `భగవంత్ కేసరి`లో జైలర్ కూతురిని సింహాంలా పెంచాలని, అందు కోసం ఆ పాప తండ్రికిచ్చిన మాట కోసం తనని ఆర్మీలోకి పంపాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. `జన నాయకుడు`లోనూ అదే చూపిస్తున్నాడు. తెలుగులో శ్రీలీల క్యారెక్టర్‌ని బలంగా తయారు చేస్తూ తనని ఆర్మీలోకి పంపించాలని బాలకృష్ణ క్యారెక్టర్ ప్రయత్నిస్తున్నట్టే విజయ్ సినిమాలోనూ అదే సీన్ రిపీట్‌చేశారు.
అక్కడి నుంచే కథ మార్చేశారు...
అంతకు ముందు జైలుకు వెళ్లడం, అక్కడ రౌడీ గ్యాంగ్‌తో వెరైటీ ఆయుధంతో ఫైట్ చేయడం, ఆ తరువాత విజ్జి పాపని ఎత్తుకెళ్లిన వాళ్లని ఫ్యాక్టరీకి వెళ్లి చితక్కొట్టడం లాంటి సీన్‌లన్నీ సేమ్ టు సేమ్ వాడారు. అయితే ఇందులో రాహుల్ సాంగ్వీ క్యారెక్టర్‌ని మరింత మార్చేశారు. ఆర్మీకి పంపించాలనే అమ్మాయిని చంపడం కోసం రంగంలోకి దిగే రాహుల్ సాంగ్వీ క్యారెక్టర్‌ని తెలుగు సినిమాలో చూపిస్తే `జన నాయకుడు`లో ఆ క్యారెక్టర్ పరిథిని భారీ స్థాయిలో మార్చి బాబి డియోల్ క్యారెక్టర్ ని రంగంలోకి దించడం ఇందులో చేసిన భారీ మార్పు. పక్కాగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ చాలా వరకు మార్చినట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ ఓ అమ్మాయి, తనని కాపాడే ఓ చిచ్చా పోరాటాన్ని చూపిస్తే విజయ్ సినిమాలో మాత్రం దాన్ని దేశ సమస్యతో ముడిపెడుతూ..దీనిపై రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు? ..సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. తెలగులో సీరియస్ గా సాగుతూనే కామెడీ టోన్ తీసుకుంటే విజయ్ మూవీలో మాత్రం కథ సీరియస్ టోన్‌లో సాగేలా ప్లాన్ చేశారు. అంతే కాకుండా ప్లాన్ బాబి డియోల్ క్యారెక్టర్‌తో `ఓ. ఎం` అని చెప్పించడం, అదనంగా ప్రకాష్‌రాజ్, ప్రియమణి, సునీల్ క్యారెక్టర్లని తీసుకోవడం, విజ్జి సమస్యని కాస్తా దేశ సమస్యగా మార్చడం, రాకెట్ లాంచర్లు, డ్రోన్ ఫైట్స్, రాజకీయ అంశాలని మరింతగా జోడించి వాటినే ప్రధానంగా హైలైట్ చేశారు.
విజయ్ కోసం రాజకీయ మెరుపులు...
దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబుతూ రాజకీయాల్లో మరింత యాక్టీవ్‌గా ఉండబోతున్నాడు. ఆ కారణంగానే `జన నాయగన్` మూవీలో విజయ్ పొలిటికల్ లైఫ్‌కు మరింత ఉపయోగపడేలా రాజకీయ మెరుపులు అద్దినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు మంచి చేస్తానని ఇందులోకి రాకు. నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో`. అంటూ బాబీ డియోల్ వార్నింగ్ ఇచ్చే సీన్.. `అర్హతలేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు` అంటూ సాగే డైలాగ్‌లు విజయ్ ని రాజకీయ కోణంలో బలపరిచే విధంగా ఉన్నాయి.
ఇక విజయ్ ఫేమస్ డైలాగ్ `ఐయామ్ వెయిటింగ్` ని కాస్తా రాజకీయ కోణంలో మార్చి `అయామ్ కమింగ్` అంటూ చెప్పించారు. ఇక రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టే వారి కోసం అన్నట్టుగా `నిన్ను నాశనం చేస్తాను...అవమానిస్తానని ఎవడు చెప్పినా సరే తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐయామ్ కమింగ్`.., ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోరి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికంట్రా` అని ట్రైలర్‌లో విజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో మరెన్ని మార్పులు, రాజకీయ కౌంటర్లు ఉన్నాయో తెలియాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.