రౌడీ బాయ్ కొత్త సినిమా లాంఛ్.. ఈసారి కొట్టాల్సిందే!
రాజావారు రాణివారు ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి.;
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఇలా ముగిసిందో లేదో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లోకి వచ్చేశాడు. తన తదుపరి సినిమా ప్రారంభించేశాడు. ఎప్పుట్నుంచో ప్రచారంలో ఉన్న రౌడీ జనార్ధన్ సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది. హైదరాబాద్ లో ఈ కొత్త సినిమా పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ముగిశాయి.
రాజావారు రాణివారు ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఇవాళ జరిగిన గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. కాగా, ఈ సినిమా కోసం విజయ్- దిల్ రాజు మరోసారి కలిశారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇదివరకు ఈ కాంబోలో పలు సినిమాలు వచ్చాయి. చివరిసారిగా ఈ బ్యానర్ లో విజయ్ ఫ్యామిలీ మ్యాన్ సినిమా చేశాడు. ఈ సినిమా అంతగా ఆడలేదు.
క్రిస్టో జేవియర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇక ఇందులో విలన్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట. అందుకోసం బాలీవుడ్ నుంచి స్టార్ నటుడుని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 16 నుంచి ఈ సినిమా షూటంగ్ ప్రారంభం కానుంది. రెగ్యులర్ గా చిత్రీకరణ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇదివరకు ఓ సందర్భంలో చెప్పారు.
కాగా, ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ రఫ్ అండ్ స్టన్నింగ్ లుక్ లో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాలో విజయ్ మునుపటిగాలా కాకుండా కొత్తగా, విభిన్న పాత్రలో ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న విజయ్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
దీంతోపాటు విజయ్ మరోవైపు రాహుల్ సంకృత్యన్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటిపై రౌడీ బాయ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ కు తొలి రోజు మంచి టాకే వచ్చినా.. అది కలెక్షన్లు సాధించడానికి పెద్దగా తోడ్పడలేదు. అందుకే ఇప్పుడు విజయ్ కు క్లీన్ హిట్ అవసరం. అటు పెళ్లికి ముందు తను మంచి విజయం సాధించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.