విద్యాబాలన్-ఆర్. బాల్కీ మిస్టరీ సినిమాపై క్లారిటీ!

బాలీవుడ్ నటి విద్యా బాలన్ - ప్రఖ్యాత దర్శకుడు ఆర్. బాల్కీ కలయికలో తెర‌కెక్క‌నున్న‌ తమిళ చిత్రం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-10-07 18:30 GMT

బాలీవుడ్ నటి విద్యా బాలన్ - ప్రఖ్యాత దర్శకుడు ఆర్. బాల్కీ కలయికలో తెర‌కెక్క‌నున్న‌ తమిళ చిత్రం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2009లో వచ్చిన క్లాసిక్ హిట్ `పా` చిత్రం తర్వాత 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఇద్ద‌రు మళ్లీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం అభిమానుల్లో, చిత్రసీమలో భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన క్షణం నుంచే అనేక కథనాలు, ఊహాగానాలు షికారు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా విద్యా బాలన్ దిగ్గజ గాయని బయోపిక్‌లో నటిస్తోందనే వార్త నెట్టింట ప్రచారమైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్. బాల్కీ ఆ పుకార్లకు చెక్ పెట్టారు.

విద్యా బాలన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ తమిళ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫోటోను పంచుకున్నారు. అందులో ఆమె సాంప్రదాయక లుక్‌లో, కళ్లజోడు ధరించి, జడ వేసుకుని స్క్రిప్ట్ పుస్తకాన్ని పట్టుకుని కనిపించారు. ఈ ప్రత్యేకమైన పిక్ చూసిన నెటిజన్లు ఆమె ఏదో ప్రముఖ సంగీత విద్వాంసురాలి లేదా దిగ్గజ గాయని జీవిత కథలో నటిస్తోందని భావించారు. ఈ ప్రాజెక్ట్‌కి స్వర మాంత్రికుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారనే వార్త తోడవ్వడంతో ఇది కచ్చితంగా లెజెండరీ సింగర్ బయోపిక్ అనే వార్త వైరల్ అయింది.

ఈ ఊహాగానాలపై బాల్కీ స్పందించారు. ఈ చిత్రం ఏ రకమైన బయోపిక్ కాదు. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇదొక వినోదాత్మకమైన, ఎంతో ఆహ్లాదకరమైన కథతో తెరకెక్కుతున్న స్వతంత్ర తమిళ చిత్రమ‌ని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న సందేహాలకు, పుకార్లకు ఒకేసారి తెరపడింది. తమ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు సీరియస్ డ్రామాను ఆశిస్తారని, కానీ ఈసారి ఓ సరికొత్త ఫన్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నామని స్పష్టం చేశారు.

బాల్కీకి హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. `చీనీ కమ్`, `పా`, `ప్యాడ్‌మ్యాన్`,`ఘూమర్` వంటి విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాగా ఆయన నేరుగా తమిళంలో దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. మరోవైపు విద్యా బాలన్ గతంలో తల అజిత్ నటించిన `నేర్కొండ పార్వై` చిత్రంలో అతిథి పాత్రలో మెరిసినప్పటికీ ఆమె పూర్తిస్థాయి కథానాయికగా తమిళంలో నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. దీంతో తమిళ చిత్రసీమలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెల కొంది.

ప్రస్తుతం విద్యా బాలన్ వరుస పాన్-ఇండియా చిత్రాలు బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జైలర్ 2`లో కీలకమైన ప్రతికూల పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకాంత్‌కు పోటీగా ఈ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు అక్షయ్ కుమార్, రాశి ఖన్నాతో కలిసి అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ‌రో భారీ కామెడీ చిత్రంలో కూడా విద్య భాగమయ్యారు.

Tags:    

Similar News