అఖిల్, నితిన్ సినిమాలు.. ఆ తప్పులపై డైరెక్టర్ రియలైజేషన్
దర్శకుడు వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
దర్శకుడు వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ప్రమోషనల్ ఈవెంట్లలో భాగంగా వెంకీ తన గత సినిమాల రిజల్ట్స్ పై ఓపెన్ గా మాట్లాడాడు. తన కెరీర్ లో ఎదురైన ఒడిదుడుకులను పబ్లిక్ గా ఒప్పుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
అఖిల్ అక్కినేనితో తీసిన మిస్టర్ మజ్ను సినిమాలో తప్పులు జరిగాయని వెంకీ ఎలాంటి మొహమాటం లేకుండా డైరెక్ట్ గా అంగీకరించాడు. ఆ సినిమా సెకండాఫ్ విషయంలో తను ఇంకాస్త బెటర్ గా ఫోకస్ చేసి ఉంటే రిజల్ట్ కచ్చితంగా వేరేలా ఉండేదని చెప్పాడు. ఒక డైరెక్టర్ ఇలా తన సినిమాలోని లోపాలను దాచుకోకుండా పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద ఒప్పుకోవడం చాలా రేర్ అని చెప్పొచ్చు. తన తప్పులను రియలైజ్ అయ్యి ముందుకు సాగుతున్న తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.
నితిన్ తో తీసిన రంగ్ దే సినిమా గురించి చెబుతూ.. ఆ ప్రాజెక్ట్ మాత్రం ఒక ఇన్నోసెంట్ విక్టిమ్ అంటూ వెంకీ ఫీల్ అయ్యాడు. ఆ కంటెంట్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుందని, బహుశా వేరే టైమ్ లో లేదా వేరే రోజు రిలీజ్ అయ్యుంటే దాని రిజల్ట్ మరోలా ఉండేదని తన మనసులోని మాట బయటపెట్టాడు. కొన్నిసార్లు రిలీజ్ టైమింగ్స్, మనం తీసుకునే నిర్ణయాల వల్ల మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ అవుతాయని చాలా క్లియర్ గా వివరించాడు.
సినిమాల మధ్య కచ్చితంగా కొంత గ్యాప్ ఉండాలని, ప్యాకేజింగ్ కరెక్ట్ గా ఉంటేనే రిజల్ట్ పాజిటివ్ గా వస్తుందని వెంకీ స్పష్టం చేశాడు. పాత సినిమాల ఫ్లాప్స్ నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఇప్పుడు సూర్యతో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కథను చాలా కేర్ ఫుల్ గా డిజైన్ చేశాడట. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ గా అడ్రెస్ చేసినట్లు, అది సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని వెల్లడించాడు.
పాత్రల మధ్య బాండింగ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించడం తన స్పెషాలిటీ అని మరోసారి ప్రూవ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందని ఒక హింట్ ఇచ్చాడు. సూర్య, మమితా బైజు, ఒక చిన్న బాబు చుట్టూ తిరిగే ఈ స్టోరీలో ఎమోషన్స్ చాలా నాచురల్ గా వర్కౌట్ అవుతాయట. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా స్క్రిప్ట్ ని చాలా పక్కాగా రాసుకున్నట్లు వెంకీ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
పక్కా కమర్షియల్ హంగుల కంటే కూడా కథలోని కంటెంట్, పాత్రల స్వభావమే విశ్వనాథ్ అండ్ సన్స్ కు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎలాంటి ప్రమోషనల్ ఆర్భాటం లేకుండా వస్తున్న ఈ సినిమాపై వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సూర్యతో కలిసి చేసిన ఈ డిఫరెంట్ ఎమోషనల్ అటెంప్ట్ జనాలను ఏ స్థాయిలో మెప్పిస్తుందో మరికొన్ని రోజుల్లో థియేటర్లలో తేలిపోనుంది.